నిశ్చితార్థమైన రెండో రోజే మృత్యు ఒడిలోకి..

by sudharani |
నిశ్చితార్థమైన రెండో రోజే మృత్యు ఒడిలోకి..
X

దిశ, చేగుంట: నిశ్చితార్థం జరుపుకున్న ఆనందం రెండు రోజులైనా కాకముందే యువకుడు మృతి చెందాడు. అంతే కాకుండా నిశ్చితార్థానికి వచ్చిన యువకుడు సైతం మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మైసమ్మ గారి స్వామి(25) ఈనెల 26వ తేదీ ఆదివారం రోజు వంటిమామిడి గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య నిశ్చితార్థం జరుపుకున్న స్వామి మంగళవారం రాత్రి బావిలో మోటర్ దించే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతుడు స్వామి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వారి రోదనలకు అంతులేకుండా పోయింది.

బావిలో పడి మృతి చెందిన మైసమ్మ గారి స్వామి నిశ్చితార్థానికి వచ్చిన బంధువు బాయికాడి ప్రవీణ్ (20) కూడా బావిలో పడి మృతి చెందాడు. మృతుడు స్వామి వృత్తి రీత్యా ఆటో నడుపుతూనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. బాయికాడి ప్రవీణ్ మేడ్చల్ లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే స్వామి నిశ్చితార్థం కోసం వచ్చి అతడితో పాటు బావిలో పడి ప్రవీణ్ కూడా మృతి చెందాడు. కాగా.. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బావిలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బావిలో పడిన మృతదేహాలను వెలికితీయడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story