Central Minister : కేంద్రం బడ్జెట్ లో ఏ రాష్ట్రంపై ప్రీతి లేదు

by Sridhar Babu |
Central Minister : కేంద్రం బడ్జెట్ లో ఏ రాష్ట్రంపై ప్రీతి లేదు
X

దిశ, మెదక్ టౌన్ : కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు సమాన కేటాయింపులు చేశామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. మెదక్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై శనివారం మీడియా సమావేశం ఎంపీ రఘునందన్ రావు తో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు సమాన కేటాయింపులు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని ఏర్పాటు ఆవశ్యకత ఉంది కాబట్టి బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్ కు తెలంగాణ కంటే కొంత మేర ఎక్కువ నిధులు కేటాయించామని, కానీ ఇందులో తెలంగాణకు అన్యాయం చేయాలనే ఉద్దేశం ఎక్కడా లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయని, అలా అయితే తమిళనాడు, కర్ణాటక లో బీజేపీ అధికారంలో లేదని, అయినా వారికి సైతం అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే కేటాయింపులు చేశామన్నారు.

దేశంలో 85 శాతం ఉన్న పేదల కోసం మోడీ సర్కార్ పనిచేస్తుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్రం ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండా గతంలో 10 లక్షలు ఇచ్చే ముద్రా రుణాలను 20 లక్షలకు పెంచిన ఘనత మోడీ ప్రభుత్వందే అన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఇంటింటికి గ్యాస్, ప్రధాని ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటివరకు మూడు కోట్ల ఇళ్లు ఇచ్చామన్నారు. ఐదేళ్లు మోడీ సర్కార్ వికసిద్భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ సామాజిక ఆర్థిక, వ్యవసాయ, యువత అభివృద్ధికి తోడ్పడే విధంగా బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమికి దేశమంతా సమానమే అని

ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అందరిని సమానంగా చూస్తామన్నారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం తన పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రాల్లో నీటిపారుదల ప్రాజెక్టులకు, జాతీయ రహదారులకు తమ వంతు సహాయ సహకారం నిరంతరం అందిస్తున్నామన్నారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసినా కొన్ని సీట్లు పెంచుకునే విషయంలో సఫలమైనట్టు తెలిపారు. ప్రజల ఆదరణతో మోడీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 22 వేల కోట్లు గ్రాండ్స్ కింద వస్తున్నట్లు సాక్షాత్తు డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇండ్లు వస్తాయని అందులో తెలంగాణకు కూడా ఇండ్ల కేటాయింపులు ఉంటాయని, వాటిని పేరు మార్చి ఇందిరమ్మ

ఇండ్ల కింద లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ముద్ర యోజన పథకాన్ని ఉపయోగించుకొని పేద వారు పారిశ్రామవేత్తలుగా ఎదుగుతున్నారని, ఆ పథకం విజయవంతం కావడంతో పేదలు మరింత ఆర్థికంగా ఎదుటడానికి 10 లక్షలు నుంచి 20 లక్షలకు ముద్ర లోన్ పెంచడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్డీఏ వస్తే దళితులకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేసినా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. దేశంలో 1962 తర్వాత జవహర్లాల్ నెహ్రూ మూడుసార్లు ప్రధానిగా అయిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లపాటు పాలన సాగించి నాలుగో సారి గెలిచేందుకు మార్గాలు ఎన్నుకుంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కొడంగల్ తప్ప మిగతా నియోజకవర్గాల పేరు ఎక్కడ కూడా వినిపించలేదు అన్నారు. కొడంగల్ మెడికల్ కాలేజ్ కేటాయించినట్లుగా మెదక్ మెడికల్ కాలేజీకి ఎందుకు నిధులు కేటాయించలేదో చెప్పాలన్నారు. దాన్ని ప్రశ్నించేందుకు ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు చేయాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed