డబ్బుల కోసం యువకుడిని హత్య చేసిన దుండగులు

by Naresh |
డబ్బుల కోసం యువకుడిని హత్య చేసిన దుండగులు
X

దిశ, జగదేవపూర్: డబ్బులు కోసం ఓ యువకుడిని హత్య చేసి చెరువులో పడేశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పీర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఎర్ర కరుణాకర్(28) ఈనెల 18వ తేదీన ఇంట్లో నుంచి కూలీ పని నిమిత్తం వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు తెలిసిన వారిని, బంధువులను ఆరా తీయగా ఎక్కడ కనిపించకపోవడంతో ఈనెల 20వ తేదీన కుటుంబీకులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా శనివారం జగదేవపూర్ మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణం వద్ద జగదేవపూర్‌కు చెందిన స్వామి అనే యువకుడు మొబైల్ ఫోన్‌ను అమ్మడానికి పెట్టగా గమనించిన వైన్స్ షాప్ దుకాణదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా కరుణాకర్ హత్యకు గల కారణాలు బయటకు వచ్చాయి. కరుణాకర్ ఈనెల 18న ఇంటి నుంచి జగదేవపూర్ లోని వైన్స్ షాప్ దగ్గర మద్యం సేవించి మద్యం షాప్‌కు ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద నిద్రిస్తున్నాడు.

కరుణాకర్ నిద్రిస్తున్న విషయాన్ని గమనించిన జగదేవపూర్‌కు చెందిన రాగుల గణేష్, కొంపల్లి నాగరాజు లు కరుణాకర్‌ను మచ్చిగా చేసుకొని తిరిగి ముగ్గురు కలిసి రాత్రి 8 గంటలకు మద్యం సేవించారు. మృతుడు కరుణాకర్ వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గమనించిన గణేష్, నాగరాజులు గొడవకు దిగారు. ఈ ఘర్షణలో గొంతు నమిలి రూ.30 వేల నగదు, మొబైల్‌ను తీసుకొని కరుణాకర్ ను చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్వామి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన నిజాన్ని ఒప్పుకున్నారు. ఆదివారం ఉదయం కరుణాకర్ మృతదేహాన్ని జగదేవపూర్ చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కరుణాకర్ కుటుంబ సభ్యులు మృతికి కారణమైన నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ముందు గల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎసీపీ రమేష్ జగదేవపూర్ చేరుకొని నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. మృతునికి భార్య లావణ్యతో పాటు నాలుగేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed