బిల్లులు రాక.. అప్పుల్లో కూరుకు పోతున్నాం..

by Vinod kumar |
బిల్లులు రాక.. అప్పుల్లో కూరుకు పోతున్నాం..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రజల, ప్రభుత్వ మెప్పు కోసం చేసిన అభివృద్ధి పనులకు నెలల తరబడి బిల్లులు రాక అప్పుల్లో కూరుకు పోతున్నామని మండల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నంగునూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జాప అరుణా దేవి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి నెలల కావొస్తున్న ఇప్పటి వరకు ఏ గ్రామంలో బిల్లు రాలేదని సర్పంచ్ లు సమావేశం దృష్టికి తీసుక వచ్చారు.

ప్రభుత్వ పరిధిలోని పెండింగ్ లో ఉందని ఇంచార్జి ఎంపీడీవో వేణుగోపాల్ సమాధానం ఇచ్చారు. ఇండ్ల పైన ప్రమాదకరంగా కరెంట్ తీగలు, వ్యవసాయ బావుల వద్ద వేలాడుతున్న కరెంట్ తీగలున్నాయని పలు మార్లు చెప్పిన అధికారులు స్పందించడం లేదని విద్యుత్ ఏఈ ప్రభాకర్ ను ప్రజాప్రతినిధులు నిలదీశారు.

విద్యుత్ అధికారులకు సమన్వయం లేక కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు. సబ్ స్టేషన్ లో ఆపరేటర్ నుంచి జేఎల్ఎం వరకు ఇష్ట రీత్యా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ లు నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ పోస్ట్ ల భర్తీ లేక గ్రామ పంచాయతీ సిబ్బంది తో పనులు చేయిస్తున్నామని వాపోయారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అని మండల విద్యాధికారి దేశి రెడ్డి సమాధానమిచ్చారు.

అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నాసిరకం సరుకులను అంటగడుతున్నారని సభ్యులు సూపర్వైజర్ ను ప్రశ్నించారు. గ్రామపంచాయతీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి జమ చేస్తే ఆ డబ్బులు తీయడానికి ఫ్రీజ్ చేసి, కరెంట్ బిల్లులకు వాడుకుంటే గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయం, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ, మిషన్ భగీరథ, ఐకేపీ హార్టికల్చర్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తమ తమ నివేదికలను చదివి వినిపించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, సొసైటీ చైర్మన్లు ఎల్లంకి మహిపాల్ రెడ్డి, కోల రమేష్ గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దిపడగ కిష్టారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Next Story