- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ప్రపంచమంతా నేడు ఇదే జీవన విధానానికి అలవాటుపడుతోంది'

దిశ, హైదరాబాద్ బ్యూరో / కార్వాన్ : నేడు భారతదేశమే కాదు ప్రపంచమంతా హిందూ జీవన విధానానికి అలవాటు పడుతోందని, ప్రపంచ దేశాల్లో సైతం జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తుతున్నాయని ప్రముఖ స్వామీజీ, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యుడు రామ్ విలాస్ దాస్ వేదాంతి అన్నారు. ప్రపంచానికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు అనే విషయాన్ని రామభక్తుడు ఆంజనేయస్వామి నిరూపించాడన్నారు. శనివారం భాగ్యనగరంలో వీహెచ్పీ, భజరంగ్ దళ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ శోభాయాత్ర బహిరంగ సభలో రామ్ విలాస్ వేదాంతి మాట్లాడారు. గౌలిగూడ హనుమాన్ మందిర్ దగ్గర శోభాయాత్రను ప్రారంభించిన ఆయన కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా దగ్గర బహిరంగ సభలో మాట్లాడారు. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే భాగ్యనగరంలో భక్తి ఎక్కువగా ఉందని అన్నారు. హిందూ సంఘటనలో భాగ్యనగరం భారతదేశానికి దిక్సూచిగా మారుతుందన్నారు. తాను గతంలో చాలాసార్లు భాగ్యనగరం వచ్చానని, అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ రోజురోజుకు హిందూ సంఘటన బలపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
హిందువులు ఏది చేసినా చట్టానికి లోబడే పనిచేస్తారని, అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో కూడా సుప్రీంకోర్టులో విజయం సాధించాక అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో విశ్వహిందూ పరిషత్ పూర్వ అధ్యక్షుడు దివంగత అశోక్ సింఘాల్ తో పాటు ఎంతో మంది సాధుసంతుల సంకల్పం నెరవేరిందన్నారు. అయోధ్య ఉద్యమంలో తాను 25 సార్లు జైలు జీవితం అనుభవించానని, ఇది తనకు గర్వకారణం అని చెప్పారు. రామ మందిరం నిర్మాణం ఇంకొంచెం మిగిలి ఉందని, అది పూర్తికాగానే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. మధుర శ్రీకృష్ణ మందిరం, కాశీ విశ్వనాథ మందిరం నిర్మించాలని పరోక్షంగా గుర్తు చేశారు. ఆ తర్వాత ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే రామరాజ్యం సాధించాలని, అందుకు ఆంజనేయస్వామి ఆశీస్సులు తప్పక అవసరమని చెప్పారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో దేశమంతా కాషాయం జెండా రెపరెపలాడుతోందని ఆయన పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకున్నామని, నేడు కాశ్మీర్ తో పాటు మణిపూర్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఒరిస్సాతో పాటు అనేక హిందూ వ్యతిరేక ప్రాంతాలలో కూడా ఈరోజు ఆంజనేయస్వామి దయవల్ల కాషాయం జెండా ఎగురుతోందన్నారు.
తెలంగాణలో హిందువుల భవితవ్యం మారాలంటే ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలని డిమాండ్ చేశారు. హిందూ సంక్షేమం కోసం తాను 125 కోట్ల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారని చెప్పారు. ఆంజనేయస్వామి అనుగ్రహం ఉంటే కానిది లేదని, లంకను దహనం చేసి సముద్రంలో వంతెన నిర్మించిన బలశాలి ఆంజనేయుడు అని, ఆయన అనుగ్రహంతోనే అయోధ్యలో భవ్య మందిరం నిర్మాణం అయిందని చెప్పారు. అదేవిధంగా మూడుసార్లు కేంద్రంలో ఆంజనేయస్వామి అనుగ్రహంతోనే కాషాయ జెండా రెపరెపలాడిందన్నారు. అంతకుముందు హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది హిందూ కార్యకర్తలతో ర్యాలీ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ , ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు రామరాజు, పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, కుమార్ స్వామి, సుభాష్ చందర్, ఇతర ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.