రెవెన్యూ అధికారుల అవినీతి లీలలు.. గుట్టు చప్పుడు కాకుండా మూగ,చెవిటి వ్యక్తి భూమి స్వాహా!

by Aamani |
రెవెన్యూ అధికారుల అవినీతి లీలలు.. గుట్టు చప్పుడు కాకుండా మూగ,చెవిటి వ్యక్తి భూమి స్వాహా!
X

దిశ, నవాబుపేట : నవాబుపేట మండలం లో గతంలో పనిచేసిన పలువురు రెవెన్యూ అధికారుల అవినీతి లీలలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరం చౌడూరు గ్రామానికి చెందిన ఓ దేశ్ ముఖ్ భూమి అక్రమ పట్టా గురించి బయటపడగా, సుమారు నెల రోజుల క్రితం మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య భూమి దొంగ పట్టా విషయం వెలుగులోకి వచ్చింది. అదే తరహాలో శనివారం మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మూగ,చెవిటి వ్యక్తి అయిన తీగలపల్లి కేశవులు అనే వృద్ధుడి భూమిని గుట్టు చప్పుడు కాకుండా ఆయన దాయాది పాలమూరు భీమయ్య తన భార్య అమృత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని అంతే గుట్టుచప్పుడు కాకుండా ఇతర గ్రామానికి చెందిన మరో వ్యక్తికి విక్రయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

కొండాపూర్ గ్రామానికి చెందిన మూగ చెవిటి వ్యక్తి అయిన తీగలపల్లి కేశవులుకు గ్రామంలోని పలు సర్వే నంబర్లలో సుమారు 11.37 ఎకరాల భూమి ఉంది. వృద్ధుడైన కేశవులుకు మగసంతానం ఎవరూ లేకపోవడంతో ఆయన భార్య జంగమ్మ ఆ భూమి వ్యవహారాలు చూసుకుంటున్నది. ఆ భూమిపై ఆయన దాయాది పాలమూరు భీమయ్య కన్ను పడింది. దాంతో అదును చూసుకుని భీమయ్య వృద్ధుడైన కేశవులు పేరుపై 133/ఆ సర్వేనెంబర్ లో గల 1.31 ఎకరాల భూమిని గతంలో ఇక్కడ పనిచేసిన అవినీతి రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో తన భార్య అమృత పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అమృత పేరుపై నుండి మళ్లీ ఎలికట్ట గ్రామానికి చెందిన తమ సమీప బంధువు అయిన నక్క శ్రీను తండ్రి నక్క నారాయణ పేర రిజిస్ట్రేషన్ చేయించారు.ఈ దొంగ పట్టాల వ్యవహారాల గురించి తెలియని కేశవులు భార్య జంగమ్మ తానే ఆ భూమిని ఇప్పటికి కూడా సాగు చేస్తూ పంటలు పండిస్తున్నది.

తాము ఖాస్తులో ఉన్న భూమికి సంబంధించిన రైతుబందు డబ్బులు ఇటీవల తమకు రాకపోవడంతో అందుకు సంబంధించి ఆమె ఆరా తీయడంతో పాలమూరు భీమయ్య మోసం వెలుగులోకి వచ్చింది. ఆ భూమి పాలమూరు భీమయ్య గుట్టుచప్పుడు కాకుండా తన భార్య అమృత పేర రిజిస్ట్రేషన్ చేయించుకుని అంతే గుట్టు చప్పుడు కాకుండా ఇతర గ్రామానికి చెందిన తన సమీప బంధువు నక్క శ్రీను పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన విషయం తెలియడంతో ఆమె అవాక్కయింది. ఈ విషయం గురించి నిందితుడు పాలమూరు భీమయ్యను భూ యజమాని కేశవులు భార్య జంగమ్మ నిలదీయడంతో ఆమెపై దోషులైన భీమయ్య, అమృత, శ్రీను కక్షగట్టి చంపుతామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో దిక్కుతోచని జంగమ్మ శనివారం వారి మోసాన్ని స్థానిక ఎస్సై విక్రమ్ దృష్టికి తెచ్చి వారి నుంచి తనకు,తన భర్తకు ప్రాణహాని ఉన్నదని అందువల్ల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై బాధిత మహిళ జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.విక్రమ్ తెలిపారు.

Next Story

Most Viewed