- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దవాఖానాల్లో ఆ ఏర్పాట్లను వెంటనే చేయండి.. మంత్రి దామోదర కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: మండుతున్న వేసవి ఎండల నేపథ్యంలో దవాఖానాల్లో ఏర్పాట్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతోందని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నదని, ఈ నేపథ్యంలో అవుట్ పేషెంట్లకు, ఇన్‌పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీయూలు, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు.
అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానాల్లో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఇతర అంశాలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. వేసవి ఎండల నేపథ్యంలో పెద్ద హాస్పిటల్స్‌లో ప్రతి బ్లాక్‌లోనూ, అలాగే ప్రతి ఫ్లోర్‌లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు.
అంతే కాకుండా హాస్పిటల్ ఆవరణలో కూడా అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని అధికారులను మంత్రి దామోదర రాజ నర్సింహా అప్రమత్తం చేశారు. అన్ని హాస్పిటల్స్‌లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్‌లో పవర్ కేబుల్స్‌ను తరుచూ చెక్ చేయించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట పాత వైర్ల స్థానంలో కొత్త వైరింగ్ చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన లోపల, బయట గుట్కా నమలడం, స్మోకింగ్ చేయడం , మద్యం తాగడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దన్నారు.
ప్రతీ ఆస్పత్రిలో ఫైర్ అలార్మ్, స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలన్నారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో, లేవో ? చూడాలని వాటి తుది గడువు తేదీలను సైతం చెక్ చేయాలని ఆదేశించారు. అలాగే అగ్ని ప్రమాదాల మంటలు ఆర్పే యంత్రాల వినియోగంపై ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీకి శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఫైర్ సేఫ్టీ, విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించి చేయాల్సిన, చేయకూడని పనుల గురించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రి సమీపంలోని ఫైర్ స్టేషన్ అధికారులతో, ఆస్పత్రి అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ ఈ వేసవిలో తరుచు నిర్వహించాలని మంత్రి దామోదర రాజ నర్సింహా అధికారులకు సూచించారు.
ఆసుపత్రి రోగులకు వడ దెబ్బ నివారణ కోసం..
ఆసుపత్రి రోగులకు వడ దెబ్బ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి దామోదర రాజ నర్సింహా ఆరా తీశారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందు కోసం హాస్పిటల్స్, బస్ స్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కంటెంట్‌ను రూపొందించి, ప్రజలకు చేరవేయాలన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధి హామి కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు.
పట్టణాల్లో ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు వడ దెబ్బపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. వడ దెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు, అన్ని హాస్పిటల్స్‌లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని , అవసరమైన మెడిసిన్, ఓఆర్‌ఎస్ ద్రావణాలు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైతే, వడ దెబ్బ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేసవి కాలంలో గాలిదుమారాలు, ఈదురు గాలులు, అకాల వర్షాల వలన విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందని, ఇలాంటి సమయాల్లో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వెంటనే జనరేటర్లు ఆన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు అన్ని హాస్పిటల్స్‌లో జనరేటర్లు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. అయితే, వెంటనే వాటి పనితీరును పరిశీలించాలని, అవసరమైన చోట రిపేర్లు, మెయింటనన్స్ చేయించాలని మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశించారు.
ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి దామోదర రాజ నర్సింహా పిలుపునిచ్చారు. పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలన్నారు. తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి దామోదర రాజ నర్సింహా ప్రజలను కోరారు.