రైతులను ముంచిన "రియల్" దొంగలు..

by Sumithra |
రైతులను ముంచిన రియల్ దొంగలు..
X

దిశ, అందోల్ : అందోల్ మండలంలో ఒక గ్రామంలో బక్కచిక్కిన రైతు తనకున్న ఒకటి, రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ రైతుకు ఆర్థిక అవసరం వచ్చింది. తన భూమిని తాకట్టు పెట్టి డబ్బు సర్దుబాటు చేసుకుందామని రియల్ వ్యాపారం చేసే ఒక బ్రోకర్ ను సంప్రదించాడు. ఆ రియల్ బ్రోకర్ రైతు భూమిని తాకట్టు పెట్టుకొని కాల పరిమితితో రూ. ఐదు లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ బక్క చిక్కిన రైతుకు తెలియకుండా అదే భూమిని మరొక బడా బాబు వద్ద తాకట్టు పెట్టి రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కాలపరిమితి పూర్తి అవ్వడంతో రైతు డబ్బు కట్టి తన భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయమంటే రేపు మాపు అంటూ ఆ రియల్ బ్రోకర్ కాలయాపన చేస్తున్నాడు. చివరకు తన భూమిని తాకట్టు పెట్టుకుని రూ. ఐదు లక్షల రుణమిస్తే ఆ బ్రోకర్ అదే భూమితో రూ.50 లక్షల రుణాన్ని తీసుకున్నాడని తెలిసి రైతు లబోదిబోమంటున్నాడు. సినిమాను తలపించే కథలాగా ఉన్న ఈ ఘటన వాస్తవ కావడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది.

ఇది అందోల్ మండలంలో రైతులను మోసం చేస్తున్న నయా దందా.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో రైతుల భూములను లక్షలకు తాకట్టు పెట్టుకొని అవే భూముల్ని వేరే వారికి తనకా పెట్టి కోట్లు కొల్లగొట్టిన ఉదాంతం అందోల్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా అందుతున్న వివరాల ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక వ్యక్తి అందోల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూముల్ని కొంటూ విక్రయిస్తూ రైతులతో మంచి సంబంధాలు నెలకొల్పుకున్నాడు. రైతులతో ఆ రియల్ బ్రోకర్ కు మంచి స్నేహం కుదరడంతో కొందరు రైతులు తమ ఆర్థిక అవసరాల కోసం సదరు బ్రోకర్ ను సంప్రదించారు. కొందరు తమ కూతుర్ల పెళ్లిళ్ల కోసం, మరికొందరు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం ఇలా డబ్బు అవసరమై తమకు ఉపాధినిస్తూ, కడుపు నింపుతున్న భూమిని తనఖా పెట్టి లోన్ తీసుకోవాలనుకున్నారు.

అయితే రైతుల ఆర్థిక అవసరాలను తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ రియల్ వ్యాపారి రైతులకు మాయ మాటలు చెప్పి ఆ భూమిని సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వారికి అప్పు ఇప్పించాడు. అయితే రైతులకు ఎకరాకు ఐదు లక్షల చొప్పున అప్పుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ కేటుగాడు అదే భూమిని వేరొకరికి సేల్ రిజిస్ట్రేషన్ చేసి ఎకరాకు రూ.50 లక్షలకు పైగా కొల్లగొట్టాడు. సుమారు అందోల్ మండల పరిధిలోని పదుల సంఖ్యలో రైతులను మోసం చేసి రూ. 30 కోట్లకు పైగా వసూలు చేశాడు. రైతులు తమ అప్పుకు కాల పరిమితి దగ్గర పడడంతో భూమిని రిలీజ్ చేయమని ఆ రియల్ బ్రోకర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ కోట్ల రూపాయలతో ఆ కేటుగాడు ఊడాయించాడు.

రైతుల్ని ముంచి.. కోట్లు కొల్లగొట్టి జల్సాలు..

రైతుల ఆర్థిక అవసరాలే ఆదాయ మార్గాలుగా చేసుకున్న కేటుగాడు తనదికాని భూమితో కోట్ల దందా చేశాడు. మామూలుగా బ్యాంకులో రైతులకు మార్టిగేజ్ రుణాలు అందిస్తున్న ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఎకరాకు చాలా తక్కువ మొత్తాన్ని లోన్ గా ఇస్తున్నాయి. అయితే పెరిగిన భూముల ధరలతో బయట నడుస్తున్న మార్కెట్ ధరలో 50 శాతం వరకు కొందరు ఫైనాన్స్ వ్యాపారులు అప్పుగా ఇస్తున్నారు. దీంతో రైతులు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర తమ భూమిని తనఖా పెట్టీ రుణాలు పొందుతున్నారు.

అయితే రైతులలో మార్టిగేజ్ విషయంలో అవగాహన లేకపోవడంతో చాలాచోట్ల వ్యాపారులు రైతుల భూమిని పూర్తిగా సేల్ డీడ్ చేసుకొని రైతులకు అప్పు ఇస్తున్నారు. ఇదే కోవలో సదరు రియల్ దొంగ సైతం ఆందోల్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో రైతులకు సెల్ డీడ్ ద్వారా అప్పు ఇచ్చాడు. ఆ సమయంలో పకడ్బందీగా ఆ రైతు కుటుంబ సభ్యులతో సైతం సంతకాలు తీసుకొని విక్రయ ఒప్పందం ద్వారా భూమిని అప్పగిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత వేరే బ్రోకర్లకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఇప్పటివరకు స్థానికంగా అందుతున్న సమాచారం మేరకు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి ఆ డబ్బుతో టూర్లు వేసి జల్సాలు చేస్తూ లగ్జరీ లైఫ్ ను అనుభవించినట్లు తెలుస్తోంది. తీరా కాలపరిమితి ముగిసిన తర్వాత రైతులు తమ భూమి తమకు ఇవ్వాలని వత్తిడి చేయడంతో సదరు మోసగాడు పరారీలో ఉన్నట్లు చర్చ సాగుతుంది.

రైతులను ముంచిన దొంగకు ఖద్దర్ లీడర్ల అండ..

రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని సుమారు రూ.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన రియల్ దొంగకు స్థానిక లీడర్ల మద్దతు పుష్కలంగా లభిస్తుందన్న చర్చ సాగుతుంది. రైతుల్ని ముంచి సొమ్ము చేసుకున్న డబ్బుతో జల్సాలు చేసిన ఆ కేటుగాడు రైతులు తమ భూములు కావాలని ఒత్తిడి చేస్తున్నారని స్థానిక పెద్దలను సంప్రదించినట్లు సమాచారం. ఆ మోసగాడి దగ్గర పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు నొక్కిన సదరు లీడర్లు నీకు మేమున్నామని భరోసా ఇస్తూ ఆ రియల్ దొంగని తప్పించినట్లు తెలుస్తోంది. రైతుల దగ్గర నుంచి ఒప్పంద విక్రయ పత్రం ద్వారా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఇందులో రైతులు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని ధైర్యం ఇచ్చి మరి ఆ దొంగని వెనుకేసుకొస్తున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతుంది.

రైతుల్ని నమ్మించి నిండా ముంచిన ఒక బ్రోకర్ కు సదరు లీడర్లు వకల్తా పుచ్చుకొని మద్దతుగా మాట్లాడటం పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చట్టంలో లొసుగులను, తమ అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని తమల్ని నిండా ముంచి కోట్ల రూపాయలతో ఆ రియల్ బ్రోకర్ ఉడాయించడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. పకడ్బందీగా తమతో రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేయడంతో ఏ విధంగా తిరిగి తమ భూమిని తాము రాబట్టుకోవాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లోలోపల రైతులు తీవ్ర మదన పడుతున్నారు. ఏదేమైనా రైతుల అవసరాలను ఆశగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి ఈ ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed