Collector : ఆంగ్ల భాష పై విద్యార్థులు పట్టు సాధించాలి...

by Sumithra |   ( Updated:2024-07-23 08:45:46.0  )
Collector : ఆంగ్ల భాష పై విద్యార్థులు పట్టు సాధించాలి...
X

దిశ, బెజ్జంకి : (కోహేడ) విద్యార్థులు ఆంగ్లభాష పై పట్టు సాధించినప్పుడే ముందు ముందు ఉజ్వల భవిష్యత్తును సాధిస్తారని జిల్లా కలెక్టర్ ఎం మనూ చౌదరి విద్యార్థులకు సూచించారు. మంగళవారం కోహెడ మండలం శనిగరం జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో పదో తరగతి గదిలో ఇంగ్లీష్ పిరియడ్ జరుగుతుండడంతో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో కిచెన్ షెడ్ ను పరిశీలించి వర్షం మూలంగా ఇబ్బంది కలుగుతుందని కిచెన్ షెడ్ ముందు రేకులు ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.

అనంతరం శనిగరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి శ్రీ హర్షిని అనే చిన్నారితో అక్షరాలు దిద్దించారు. విద్యార్థులకు అందజేస్తున్న పౌష్టికాహారం పై ఆయన విచారించి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడాలంటే ఆంగ్ల భాష పై పట్టు సాధించాలని, అప్పుడే దేశ విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుందని సూచించారు. అంగన్వాడి సెంటర్ అంటే అమ్మ ఒడి లాంటిదని విద్యార్థులను ప్రేమ ఆప్యాయతలతో అక్కున చేర్చుకొని విద్యను నేర్పించాలని అన్నారు. వీరి వెంట అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story