- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీలో సునీతారెడ్డి vs మదన్ రెడ్డి వార్
దిశ బ్యూరో, సంగారెడ్డి: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మూడోసారి టిక్కెట్ వచ్చే అవకాశమే లేదట. వయసు మీద పడింది. ఇక ఆయనకు ఆరోగ్యం సహకరించదట. ఈసారి మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికే అవకాశం ఇవ్వనున్నారట. టిక్కెట్ ఒప్పందంతోనే ఆమె కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారట. మేడమ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ ఉందని ఆమె వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. కాబోయే ఎమ్మెల్యే సునీతారెడ్డి అంటూ మూడు రోజుల క్రితం ఆమె వర్గీయులు పెద్ద ఎత్తున బర్త్ డే వేడుకలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సునీతారెడ్డి తన వర్గాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధాన దృష్టి సారించినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మేడం వర్గం బలపడుతుండగా, ఎమ్మెల్యే వర్గం బలహీనపడుతున్నది. బయటకు అనకపోయినప్పటికీ మూడోసారి మదన్ రెడ్డి కి అవకాశం ఉండదని అందరికీ తెలుసునని ఆ పార్టీకి చెందిన సునీతారెడ్డి వర్గం నేత ఒకరు చెప్పుకువచ్చారు. వర్గాల నేపథ్యంలో నర్సాపూర్ అధికార పార్టీలో రాజకీయం ఆసక్తిగా మారింది.
మూడో సారి అవకాశం ఉత్తమాటే..!
వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగులకే తిరిగి అవకాశం ఇవ్వనున్నట్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం ప్రకటనను నర్సాపూర్ లో మాత్రం అధికార పార్టీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మూడోసారి అవకాశం ఉత్తమటే అని సునీతారెడ్డి వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఏదో మాటవరుసకు సీఎం ప్రకటించారు కానీ ఆ అవకాశం ఇక్కడ మాత్రం ఉండబోదని గట్టిగా మాట్లాడుతున్నారు.
మదన్ రెడ్డికి ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదని సునితారెడ్డి వర్గీయులతో పాటు మదన్ రెడ్డి వెంటే ఉండేవారు కూడా అంటుండడం గమనార్హం. అయితే ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమ్మేళనాలలో కూడా మదన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పార్టీ ఇన్ చార్జి, ఇతర నాయకులు సభల్లో పిలుపునిచ్చినప్పటికీ సునీతారెడ్డి వర్గీయులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నర్సాపూర్ కు కాబోయే ఎమ్మెల్యే సునీతా రెడ్డిని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరిగిపోతున్నది.
మంత్రి కేటీఆర్‌తో హామీ తీసుకుని..
నర్సాపూర్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సునితారెడ్డికి టిక్కెట్ ఎప్పుడో ఖాయమైందని ఆమె సన్నిహితులు, వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పుడే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ మరోసారి నమ్మకమైన హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలోనే సునీతారెడ్డి సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో మాత్రం రోజు మాట్లాడుతున్నారట. ఇంటికి వెళ్లిన వారికి అవసరమైన పనులు చేసి పడుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు ఇతర అన్ని అంశాలపై గతంలో కంటే ఈ మధ్య సునీతారెడ్డి ఎక్కువ చొరవ తీసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే మేడం ఇక తన వర్గాన్ని బలం చేసుకుంటున్నారని ఓ నాయకుడు ‘దిశ’ ప్రతినిధితో చెప్పుకొచ్చాడు.
పుట్టిన రోజు వేడుకలతో రంగంలోకి..
నాలుగు రోజుల క్రితం తన నియోజకవర్గం నర్సాపూర్‌లో సునీతారెడ్డి పుట్టిన రోజు వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ అంశం తెరపైకి వచ్చింది. పుట్టిన రోజుకు వారం ముందు నుంచే సోషల్ మీడియాలో ఆమె సన్నిహితులు, వర్గీయులు, బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. నర్సాపూర్ లో తన ఇంటి వద్ద పుట్టిన రోజు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు పెట్టించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు.
మటన్, చికెన్, అన్ని రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేయడం, ఇంటివద్దే ఉండి వచ్చిన అందరితో ఆమె ఆప్యాయంగా పలకరించడంతో చాలా రోజుల తర్వాత మేడంలో కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నామని, కాబోయే ఎమ్మెల్యే సునీతారెడ్డేనంటూ ఆ రోజు నుంచి ప్రచారం మరింత తీవ్రమైందని చెప్పకోవచ్చు. అంతే కాకుండా రోజువారీగా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె వద్దకు నియోజకవర్గం నుంచి వెళుతున్న వారి సంఖ్య కూడా ఈ మధ్య చాలా పెరిగిందని సన్నిహితులు చెబుతున్నారు.
అదే జరిగితే తాము పోటీకి దిగుతాం..
జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సునీతారెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు మెజార్టీ పార్టీ శ్రేణులు దాదాపు గా క్లారిటీకి వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అర్థం అవుతుంది. జరుగుతున్న ప్రచారంపై మదన్ రెడ్డి వర్గీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. పార్టీ అధిష్టాం సునితారెడ్డికి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నుంచి తాము కూడా పోటీలో ఉంటామని మదన్ రెడ్డి సన్నిహితులు బహిరంగంగానే చెబుతున్నారు. పలు పార్టీ సమావేశాల్లో కూడా తయ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు తెలిసింది.
మదన్ రెడ్డి దగ్గరి సన్నిహితులైన ముగ్గురు ముఖ్య నాయకులు తాము పోటీలో ఉంటామంటున్నారు. తిరిగి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని లేదంటే మదన్ రెడ్డి వర్గం అంటే ఏమిటో చూపిస్తామని సునీతారెడ్డి వర్గానికి హెచ్చరిస్తున్నట్లు పార్టీ ముఖ్య నాయకులు ఒకరు చెప్పుకొచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా సునీతారెడ్డి వర్గం మాత్రం బలపడుతుండగా, మదన్ రెడ్డి వర్గం పలుచబడుతున్నదని ఆ నాయకుడు వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీలో రెడ్డీస్ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.