జాతీయ రహదారిపై గ్రామస్థుల ధర్నా.. మూడు గంటల పాటు నిలిచిన రాకపోకలు

by Shiva |
జాతీయ రహదారిపై గ్రామస్థుల ధర్నా.. మూడు గంటల పాటు నిలిచిన రాకపోకలు
X

దిశ, అందోల్: జాతీయ రహదారి విస్తరణ పనులను ఆసంపూర్తిగా వదిలేయడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది గ్రామస్థులు 161 జాతీయ రహదారిపై రాస్తారొకోను చేపట్టారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్థులు రహదారిపై ధర్నాకు దిగారు.

నేషనల్‌ హైవే అథారిటీ అధికారుల తీరును తప్పుబడుతూ, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. వందలాది మంది గ్రామస్థులు రోడ్డుపైకి చేరుకొవడంతో సుమారుగా రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ స్థంభించింది. జాతీయ రహదారి కావడంతో రెండు వైపుల వందలాది వాహనాలు గంటల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి సీఐ శ్రీధర్‌రెడ్డి, పుల్కల్‌ ఏఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు.

రోడ్డుపై రాస్తారొకోను విరమించాలని, ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగించోద్దని, ఏమైనా సమస్య ఉంటే జాతీయ రహదారి అధికారులతో మాట్లాడుదామని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఇంకేంతమంది ప్రాణాలు పొవాలని, ఎంతమంది అంగవైకల్యం కలుగాలని, ఇంకేప్పుడు రోడ్డేస్తారంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయించాలని వారు డిమాండ్‌ చేశారు.

నేషనల్‌ హైవే అధికారులను పిలిపించిన సీఐ శ్రీధర్‌రెడ్డి గ్రామస్థుల ముందే మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉండడం వల్లనే 700 మీ. పనులను చేపట్టలేకపోతున్నామని నేషనల్‌ హైవే అధికారులు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరిన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయిస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు రోడ్డుపై నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు ట్రాఫీక్‌ను క్లియర్‌ చేశారు.

700 మీ. మేరకు నిలిచిన రోడ్డు పనులు..

సంగారెడ్డి జిల్లా కంది నుంచి అందోలు మండలం రాంసానిపల్లి వరకు 40 కి.మీ. మేరకు రోడ్డు విస్తరణ పనులు, 17 అండర్‌ పాస్‌ల నిర్మాణం కోరకు కేంద్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లను కేటాయించింది. ఈ పనులు గతేడాది కొనసాగిస్తుండగా, దాదాపుగా పూర్తయ్యాయి. అయితే, చౌటకూర్‌ మండలం సుల్తాన్‌ పూర్‌ వద్ద వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన స్థలం ఉన్న కారణంగా రోడ్డు పనులకు కోర్డు స్టే అర్డర్‌ ఇవ్వడంతో 700మీ. మేరకు రహదారి విస్తరణ పనులను నిలిపివేశారు. దీంతో ఈ రోడ్డు మీదుగా ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలు సుల్తాన్‌పూర్‌ వద్దకు రాగానే గుంతలుగుంతలుగా రోడ్డు ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కొల్పోతుండగా, మరి కొందరు క్షతగాత్రులవుతున్నారు.

Advertisement

Next Story