చిరు ధాన్యాల పండుగ 'పాత పంటల జాతర'

by Web Desk |
చిరు ధాన్యాల పండుగ పాత పంటల జాతర
X

దిశ, ఝరాసంగం: విత్తనాలే దేవుళ్లు.. జీవ వైవిధ్యమే దేవాలయం నినాదంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాత పంటల జాతర ఘనంగా కొనసాగుతోంది. జానపద గేయాలు పంటలపై పాటలు ఆటలు, కోలాటాలు, బుర్రకథలు వివిధ రకాల ధాన్యాలతో అందంగా అలంకరించిన ఎద్దుల బండ్ల ప్రదర్శన. సేంద్రీయ విధానంలో చిరుధాన్యాల సాగు, వాటి వినియోగం పై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకే దక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ(డిడిఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే 'పాత పంటల జాతర' ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ప్రారంభమవుతుంది. కానీ ఈ సంవత్సరం కరోనా ఆంక్షల వలన ఫిబ్రవరి 1 న ఝరాసంగం మండలం ఎల్గోయి లో ప్రారంభమైంది. వివిధ గ్రామాల్లో పాత పంటల పై ప్రచారం నిర్వహించి ఫిబ్రవరి 15 వ తేదీన ఝరాసంగం మండలం లోని మాచనూర్ గ్రామంలో ముగింపు జాతర జరగనుంది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించే పాత పంటల జాతరపై దిశ ప్రత్యేక కథనం..





ఆధునిక ఆహారపు అలవాట్లు మనుషుల్ని అనారోగ్యం పాలు చేస్తున్నాయి. విదేశీ ఆహారపు మోజులో, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పడిన నేటి సమాజం అజీర్ణం, బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. కరోన సంక్షోభం కారణంగా ప్రజలు పౌష్టికాహారం వైపు మళ్లుతున్నారు. మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి తెలుస్తోంది. కొర్రల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకల మీద తిరుగుతున్నాయి. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే మాటకు సార్థకత చేకూరుతోంది. అందుకే ఒకప్పటి పచ్చ జొన్నల గట్క మళ్లీ రారమ్మని పిలుస్తోంది. ఆనాటి రాగి జావ తిరిగి కళ్లముందు కదలాడుతోంది. కనుమరుగైన సామపాశం మల్లీ సాహో అంటోంది. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు మిర్రిమిర్రి చూస్తున్నాయి.

ప్రభావం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్న సరే కొంటున్నారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. చలికాలం కొర్ర బువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. పజ్జొన్న రొట్టె, కొర్రబియ్యం తింటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందనే చైతన్యం వచ్చింది. శ్రీమంతుల ఇళ్లలోనూ పాత పంటలు, చిరుధాన్యాల వినియోగం పెరిగింది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాత పంటలపై ఇరవై రెండేళ్లుగా ప్రాధాన్యతను తెలుపుతూ ఊరురా 'పాత పంటల జాతర' ను నిర్వహిస్తోంది. ఇలా పాత పంటల గురించి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొగుడంపల్లి.. ఝరాసంగం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రైతును కదలించిన పాత పంటల గురించి గొప్పగా వివరిస్తారు..

జొన్నల రకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

జొన్నల అంటే మనకు తెలిపింది మహా అయితే రెండు మూడు రకాలు. కానీ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 'పాత పంటల జాతర' ప్రదర్శించే జొన్నల రకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవి మొక్కజొన్న, పచ్చజొన్న, ఎర్ర జొన్న, తెల్ల జొన్న, తెల్ల మల్లె జొన్న, రికపచ్చల జొన్న, గుండుశాయి జొన్న, తోక జొన్న, ఎర్ర సాయి జొన్న, పేలాల జొన్న- ఇలా పది రకాల జొన్నలుంటాయి. ఇలా అనేక రకాల పాత పంటలను ప్రదర్శనలో ప్రదర్శిస్తారు.

సొంతంగానే విత్తనాల తయారీ..





ఖరీఫ్, రబీ సీజన్‌లలో జహీరాబాద్ ప్రాంత రైతాంగం ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఆశపెట్టుకోరు. రైతులు తమ పొలాల్లో పండించుకున్న పంటల్లో నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరిస్తారు. ఆ విత్తనాలను ఈత కట్టెతో అల్లిన బుట్టల్లో పోసి, పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యం తో పాటు వేపాకు, బూడిద కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీసి నాటేందుకు వీలుగా శుభ్రం చేస్తారు. రైతులు విత్తనాలు నాటుకోగా మిగిలిన విత్తనాలను ఇతర రైతులకు ఇచ్చి సహాయ పడతారు. ఈ పద్ధతి కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లో 75 గ్రామాల్లో మహిళలు డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు.

గ్రామ గ్రామాన ఎడ్లబండ్లతో ప్రదర్శన..





పాత పంటల పై వివిధ గ్రామాల్లో తిరుగుతూ ఆయా గ్రామ సర్పంచులు గ్రామ ప్రజలు పాత పంటల ఆవశ్యకతను పాటల రూపంలో వివరిస్తారు. ప్రతి గ్రామంలో బాజా భజంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామ ప్రథమ పౌరుడు పూజలు నిర్వహించి పాత పంటల జాతర ప్రారంభిస్తారు. రైతులకు గ్రామస్తులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలపై అవగాహన కల్పిస్తారు.

దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ గురించి..





మహిళా సంఘాలతో సుమారు 75 గ్రామాల్లో పనిచేస్తున్న రెండు దశాబ్దాల నాటి అట్టడుగు సంస్థ ఇది. సంస్థ ఈ గ్రామ సమూహాలను ప్రాథమిక స్థానిక పాలన యొక్క శక్తివంతమైన అవయవాలుగా ఏకీకృతం చేసి, మహిళలు, పేదలు, దళితుల కోసం బలమైన ఒత్తిడి లాబీగా వాటిని సమాఖ్యగా చేస్తుంది.

డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆహార భద్రత, పర్యావరణ వ్యవసాయం ప్రత్యామ్నాయ విద్య రంగాలలో ప్రజల-ఆధారిత భాగస్వామ్య అభివృద్ధికి వర్కింగ్ మోడల్‌ను ప్రొజెక్ట్ చేస్తోంది. పర్మాకల్చర్ , కమ్యూనిటీ గ్రెయిన్ బ్యాంక్, కమ్యూనిటీ జీన్ ఫండ్, కమ్యూనిటీ గ్రీన్ ఫండ్, ల్యాండ్ లీజు ద్వారా సామూహిక సాగు వంటి భూ సంబంధిత కార్యకలాపాల స్ట్రింగ్ ద్వారా ఈ ప్రాంతంలో పర్యావరణం మరియు ప్రజల జీవనోపాధి వ్యవస్థ క్షీణించే చారిత్రక ప్రక్రియను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఈ కార్యకలాపాలు, భూమి సంరక్షణ పాత్రను చేపట్టడంతో పాటు, మహిళలకు వారి గ్రామ సమాజాలలో కొత్త గౌరవాన్ని మరియు ప్రొఫైల్‌ను అందించడం ద్వారా మానవ సంరక్షణకు కూడా కారణమవుతాయి. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగంలో ప్రజల జ్ఞానాన్ని పెంపొందించడానికి DDS ప్రయత్నిస్తోంది.

మహిళలకు జాతీయ అంతర్జాతీయ అవార్డులు..





దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి వాటిలో ముఖ్యమైనవి.

👉 గర్వించదగిన సందర్భం..

DDS మహిళ లు అమెరికాలో అందుకొన్న అత్యంత విలువైన బహుమతి EQUATOR PRIZE 2019 ,సెప్టెంబర్ 24,2019

👉 జీవవైవిధ్య (BIO DIVERSITY) అవార్డ్ ను ప్రిన్స్ ఆల్బర్ట్ మొనాకో ఫౌండేషన్ ద్వారా జూన్ 11,2020 నాడు అందుకోవడం జరిగింది

👉: చిరుధాన్యాల ప్రతీక నారి శక్తి అవార్డ్ 2017 ను మార్చి 18,2018 న న్యూఢిల్లీలో రాష్ట్రపతి

శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.

పాత పంటలపై అవగాహన కల్పించేందుకే జాతర: డీడీస్ డైరెక్టర్





చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకే పాత పంటల జాతరను నిర్వహిస్తున్నామని డీడీఎస్ డెరైక్టర్ పి.వి. సతీష్ పేర్కొన్నారు. ఆయన 'దిశ ప్రతినిధి' తో మాట్లాడారు.. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ప్రారంభమవుతుంది కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతోంది. భారత దేశంలోనే గ్రామీణ సమాజాలు, మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతుల ఆధ్వర్యంలో నడిచే పండుగల్లో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed