Sangareddy: వివాదాల "ఎంఎన్ఆర్".. మెడికల్ కళాశాలపై నిరసనలు

by Ramesh Goud |
Sangareddy: వివాదాల ఎంఎన్ఆర్.. మెడికల్ కళాశాలపై నిరసనలు
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: వరుస వివాదాలతో సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటున్నది. సంస్థ ఏర్పాటు మొదలుకుని ఇప్పటి వరకు ఏదో ఓ వివాదంతో రోజూ కళాశాల ముందు ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉంటున్నాయి. రెండేళ్ల క్రితం కళాశాల గుర్తింపు రద్దు, ఆ తరువాత అంటే కొద్ది రోజుల క్రితం మెడికల్ సీట్ల అవకతవకల విషయంలో అస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు తాజాగా గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడంతో మరోసారి వివాదాల్లోకి ఎక్కింది. ఆదివారం నుంచి గ్రూప్ 2 పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బ్యాగు భద్రపరుస్తే రూ.100, సెల్ ఫోన్ కు రూ. 50 ముక్కుపిండి వసూలు చేశారు. అక్కడికి తనిఖీకి వెళ్లిన అదనపు కలెక్టర్ విషయం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో యాజమాన్యం ఖంగుతిన్నది.

మీ ఇష్టం.. రూ.100 ఇవ్వాల్సిందే

ఆదివారం నుంచి గ్రూప్ 2 పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో కూడా సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 1,182 మంది అభ్యర్ధులకు సౌకర్యాలు కల్పించారు. ఇదిలా ఉండగా ఉదయం పరీక్షకు హాజరైన అభ్యర్థులు మునుపెన్నడూ లేని విధంగా యాజమాన్యం తీరు చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అభ్యర్థులు పరీక్ష హాలులోకి వెళ్లే సమయంలో తమ వద్ద ఉన్న బ్యాగులు, ఇతర సామాన్లు, ఫోన్లు భద్ర పరచడానికి డబ్బులు చెల్లించాలన్నారు. బ్యాగుకు రూ. 100, ఫోన్ కు రూ. 50, ఇతర సామాన్లకు కొంత అమౌంట్ వసూలు చేశారు. పరీక్ష సమయం కావడంతో చేసేది లేక అభ్యర్థులు డబ్బులు చెల్లించారు. అయితే ఆ విషయం తెలియక డబ్బులు తీసుకురాని అభ్యర్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఇలాంటి వసూళ్ల పరిస్థితి మాత్రం ఏ పరీక్ష కేంద్రం వద్ద చూడలేదు. మరీ ఈ ఎంఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ఇంతలా బరితెగించి ఈ వసూళ్లు ఎందుకు చేపట్టిందో అధికార యంత్రాంగం తేల్చాల్సి ఉన్నది.

మొదటి నుంచి వివాదాలే..

ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ స్థాపించిన నుంచి ఎప్పుడూ ఏదో ఓ వివాదం జరుగుతూనే ఉంది. మెడికల్ కళాశాలలో సరైన సదుపాయాలు, అర్హతలు లేవని ఆగ్రహించిన జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల గుర్తింపు జూన్ 4, 2022లో రద్దు చేసిన విషయం తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి అనుమతి రద్దు చేస్తూ మే 19వ తేదీన ఆదేశాల జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా కళాశాలలో మెడికల్ కళాశాల పీజీ సీట్ల భర్తీలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ 2002) చట్టం కింద ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి వాటిని అక్రమంగా మేనేజ్ మెంట్ విక్రయించుకుని సొమ్ముచేసుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కళాశాల నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం విషయంలో కళాశాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ఇదేమిటీ..? ఆగ్రహించిన అదనపు కలెక్టర్

గ్రూప్ 2 పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం తనిఖీ కోసం ఎంఎన్ఆర్ కళాశాల వద్దకు వెళ్లిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద బ్యాగులు, ఫోన్లు భద్ర పరచడానికి డబ్బులు తీసుకున్నారని పలువురు అభ్యర్థులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనితో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదేమిటీ..? ఇలా ఎక్కడ చూడలేదు. డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నుంచి వసూలు చేసిన అమౌంట్ ను తిరిగి వారి చెల్లించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా తమకు కళాశాల యాజమాన్యమే వసూలు చేయమని చెప్పిందని, వస్తువులకు గ్యారెంటీ ఎవరు ఉంటారని, అందుకే డబ్బులు తీసుకున్నామని అక్కడ ఉన్న సెక్యూరిటీ, ఇతర సిబ్బంది కుండబద్దలు కొట్టారు. అంతటితో ఆగకుండా పరీక్షలు నిర్వహించే బాధ్యత వేరే వారు చూస్తున్నారని, తమకు ఏ సంబంధం లేదని తాము కష్టపడుతున్నాం కాబట్టి డబ్బులు వసూలు చేశామని అక్కడ సమాచార బాధ్యతలు నిర్వహించే ఓ అధికారి చెప్పడం కొసమెరుపు.

Advertisement

Next Story