భూ నిర్వాసితుల త్యాగం మరువలేనిది : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

by Shiva |   ( Updated:2023-06-07 16:06:34.0  )
భూ నిర్వాసితుల త్యాగం మరువలేనిది : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
X

దిశ, హుస్నాబాద్ : భూ నిర్వాసితుల త్యాగంతో నెర్రెలు బారిన నేలలు త్వరలో సస్యశ్యామలం కాబోతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవ సంబరాలు శుభం గార్డెన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు కుంటలు బతుకమ్మలో వినాయకుడి, దుర్గాదేవి నిమజ్జనం చేయాలంటే నీళ్లు లేక వెలవెలబోయేవని.. ఇప్పుడు ఎక్కడ చూసినా జలకళలతో చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయన్నారు.

నియోజకవర్గంలో ఉన్న 700 చెరువులు, కుంటలు శివుని తలపైన గంగమ్మ వలే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. శనిగరం చెరువు, సింగరాయ ప్రాజెక్టు మరమ్మతు చేసుకోవడంతో పాటు దేవాదుల ద్వారా సైదాపూర్, చిగురుమామిడి మండలానికి నీళ్లు వస్తున్నాయన్నారు. మిడ్ మానేరు ద్వారా మహమ్మదాపూర్ లో నిర్మించిన ట్యాంకులకు నీళ్లు వచ్చి హుస్నాబాద్ లోని ప్రతి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అన్నారు. మహా సముద్రం గండి ద్వారా 14 గ్రామాల్లో నీటిమట్టం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసి 1.6 లక్షల ఎకరాలకు త్వరలో నీళ్లందుతాయని అన్నారు.

అంతేకాకుండా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల త్యాగం మరువలేనిదని వారికి ఎంత చేసిన తక్కువే కాబట్టి వారి సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నీటి పారుదల శాఖ ప్రచురించిన మా తెలంగాణ కోటి ఎకరాల మాగానం, సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం (తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ప్రగతి నివేదిక) పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంత వాస్తవ్యులైన సీనియర్ న్యాయవాది రచయిత గులాబీల మల్లారెడ్డి రచించిన ఎద్దు ఎవుసం, సురుకుల వైద్యం అనే పుస్తకాలను కూడా ఆవిష్కరించారు.

Advertisement

Next Story