రహదారుల పునరుద్ధరణకు రూ.83కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-04-24 13:14:50.0  )
రహదారుల పునరుద్ధరణకు రూ.83కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే మదన్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి: మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు రూ.83 కోట్ల నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వారు గ్రంథాలయ అధ్యక్షుడు చంద్రగౌడ్, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్ తో కలిసి నర్సాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన రహాదారుల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, మురుగు కాలువలు, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, పార్క్, గ్రంథాలయం, కమ్యూనిటీ భవనాలు, స్టేడియం, తదితర నిర్మాణాల ప్రగతిపై అంశాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ రహాదారుల నిర్వహణ, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్, 15వ ఆర్ధిక కమీషన్, సీ.ఎస్.ఆర్. నిధులు వంటి పధకాల క్రింద నియాజకవర్గంలో సుమారు రూ.83 కోట్లతో 71 రహదారుల నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు రాగా కొన్ని పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఇంత వరకు టెండర్లు రాని వాటికి మరోసారి టెండర్లు ఆహ్వానించి, కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తూ పనులు చేపట్టేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19 .75 లక్షల వ్యయం 39.50 కి.మీ.మేర చేపట్టే బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు వెంటనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రహాదారుల నిర్మాణాలు పూర్తయితే ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ వరకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కలుగుతోందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రగతిని సమీక్షిస్తూ నర్సాపూర్, ఉప్పులింగాపూర్లో ముగింపు దశలో ఉన్న ఇళ్లను నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయవలసినదిగా సూచించారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ భవనాన్ని జూన్ నాటికి పూర్తి చేయాలని, అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ పనులు వెంటనే చేపట్టాలన్నారు. అనుమతులు ఇస్తామని కాంట్రాక్టర్లకు సూచించారు. వెల్దుర్తి, రంగంపేటలో నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాలను మే 15 నాటికి పూర్తి చేయాలన్నారు. బిల్లులు చెల్లిస్తామని, త్వరగా గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేయవలసినదిగా కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉద్యానవనం ఏర్పాటుకు, డంప్ యార్డ్ సమీపంలో పశు వధశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన జరిపి పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసిఆర్, మంత్రి హరీష్ రావులకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు మన్సూర్, కాంట్రాక్టర్లు, నరసాపూర్, కౌడిపల్లి తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed