మూడు ఎకరాల భూమి గ్రామానికి దానం చేసిన విశ్రాంత ఆచార్యులు..

by Disha News Desk |
మూడు ఎకరాల భూమి గ్రామానికి దానం చేసిన విశ్రాంత ఆచార్యులు..
X

దిశ, దుబ్బాక: ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతాన్ని.. అన్న మాటలను నిజం చేస్తున్నారు ఓ విశ్రాంత ఆచార్యుడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో స్థిరపడ్డా ఆయన.. సొంత ఊరి పై మమకారాన్ని మరువలేక వారసత్వంగా వచ్చిన మూడెకరాల సాగు భూమిని గ్రామానికి దానం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులబాద్‌కు చెందిన గోత్రాల శైలజ, నరసింహులు అనే దంపతులు వారసత్వంగా సంక్రమించిన మూడు ఎకరాల సాగు భూమిని దాన పూర్వకంగా రిజిస్ట్రేషన్ చేసి గ్రామ పంచాయతీకి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాలరాజు గ్రామస్తులతో కలిసి వారికి నూతన వస్త్రాలు అందజేసి శాలువాతో సన్మానించి, పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. దాన పూర్వకంగా స్వాధీనం చేసుకున్న మూడు ఎకరాల సాగు భూమి లో కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ శివాలయం అభివృద్ధితోపాటు గ్రామాభివృద్ధికి వినియోగిస్తామన్నారు. అనంతరం దాత నరసింహులు మాట్లాడుతూ.. తన పూర్వీకులు మరణించిన తర్వాత ఉన్నత ఉద్యోగావకాశాల నిమిత్తం హైదరాబాద్ లో స్థిరపడ్డమన్నారు. సొంత ఊరి పై మమకారంతో పాటు ఆలయాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో భూమిని మనస్ఫూర్తిగా దానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed