మహానగరంలోకి పటాన్ చెరు గ్రామాలు

by Sridhar Babu |
మహానగరంలోకి పటాన్ చెరు  గ్రామాలు
X

దిశ,పటాన్ చెరు : హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న పటాన్ చెరు ప్రాంతంలోని గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తేవడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును అనుకొని ఉన్న పటాన్ చెరు ప్రాంతంలోని 11 గ్రామాలను గ్రేటర్ పరిధిలోనికి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం ఉన్న 630 చ.కి.మీ. నుంచి దాదాపు 2000 చ.కి.మీ. మేరకు విస్తరించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

33 గ్రామాల్లో 11 పటాన్ చెరు నుంచి...

ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న శివారు గ్రామాలకు, మున్సిపాలిటీలకు కొత్త శోభను తీసుకురావడంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు గ్రామాలను మున్సిపాలిటీలను గ్రేటర్ లో విలీనం చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. మహానగరానికి ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ లతోపాటు 33 గ్రామపంచాయతీలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

గ్రేటర్ పరిధిలోకి రానున్న 33 గ్రామాలలో పటాన్ చెరు ప్రాంతం నుంచి 11 గ్రామపంచాయతీలు గ్రేటర్ పరిధిలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో పటాన్ చెరు మండలంలోని 5 గ్రామాలు, అమీన్ పూర్ మండలంలోని 6 గ్రామాలు గ్రేటర్ పరిధిలోకి రానున్నాయి. ఔటర్ కు ఆనుకొని ఉన్న గ్రామాలను విలీనం చేస్తే మహానగరం పరిధి పెరగడంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనే ఆలోచనతో సర్కార్ ప్లాన్ చేస్తుంది.

గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ..

శివారు గ్రామాలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురానున్న ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా ఆయా గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పటాన్ చెరు మండలంలోని పోచారం, ముత్తంగి, కర్దనూరు, పాటి, ఘనాపూర్ తో పాటు అమీన్ పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, ఐలాపూర్, ఐలాపూర్ తండా, సుల్తాన్ పూర్, దయరా గ్రామ పంచాయతీలలో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న పలువురు నాయకులు ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయాలనుకుంటే తమ పంచాయతీలను మాత్రమే మున్సిపాలిటీగా మార్చాలని, వేరే ప్రాంతంలో తమను కలపడానికి వీల్లేదని అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పటికే ఆ గ్రామాలకు సంబంధించిన జనాభాతో పాటు విస్తీర్ణం, హద్దుల పూర్తి వివరాలను సేకరించిన అధికార యంత్రాంగం వచ్చే నెలలోపు గేజిట్ నోటిఫికేషన్ ద్వారా విలీన ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

మొదట మున్సిపాలిటీలో అటు తర్వాత గ్రేటర్ లోకి...

బాహ్య వలయ రహదారిని ఆనుకుని ఉన్న అమీన్ పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, ఐలాపూర్, ఐలాపూర్ తండా, సుల్తాన్ పూర్, దయారా గ్రామపంచాయతీలను అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పటాన్ చెరు మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ముత్తంగి, పోచారం, పాటి ఘనపూర్, కర్దనూరు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోకి తీసుకుని రానున్నారు.

న్యాయ పరమైన చిక్కులు లేకుండా మొదట గ్రామాలను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా డీనోటిఫై చేస్తూ మున్సిపల్ శాఖతో నోటిఫై చేస్తూ గెజిట్ ద్వారా పక్కన మున్సిపాలిటీలలో గ్రామాలను విలీనం చేసి తర్వాత ఆయా మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకుని రావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే హైదరాబాద్ మహానగర విస్తీర్ణం మరింతగా పెరగనుంది.

Advertisement

Next Story

Most Viewed