పనిచేయని గడ్డి మందుతో నష్టపోయా

by Sridhar Babu |
పనిచేయని గడ్డి మందుతో నష్టపోయా
X

దిశ, తూప్రాన్ : గడ్డి నివారణ మందు పని చేయకపోవడంతో బాధితుడు తనకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఫర్టిలైజర్ దుకాణం ముందు నిరసన వ్యక్తం చేశారు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు గత నెల 29వ తేదీన తూప్రాన్ లో శ్రీ నటరాజ్ ట్రేడర్స్ లో నాలుగు ఎకరాలకు గడ్డి నివారణ మందు ఇవ్వాలని కోరగా యజమాని బసగ్రీన్ , రీబాక్ మందును 5600 రూపాయలు తీసుకొని ఇచ్చాడు. గడ్డి మందు పొలంలో చల్లినా తుంగ చనిపోకపోవడంతో ఈ విషయమై షాపు యజమానికి, తూప్రాన్ వెల్దుర్తి మండల అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. షాపు యజమాని కంపెనీ వారిని పిలిపించాడని, వారు తన పొలాన్ని పరిశీలించి ఈ గడ్డి మందు తుంగకు పని చేయదని వేరే మందు చల్లాలని చెప్పారని బాధితుడు పేర్కొన్నాడు.

వ్యాపారి ఇచ్చిన గడ్డి మందును తాను పూర్తి నమ్మకంతో చల్లితే గడ్డి చనిపోకపోవడంతో తాను తీవ్రంగా నష్టపోయానని, పరిహారం ఇప్పించాలని దుకాణం ముందు నిరసన వ్యక్తం చేశాడు. దీంతో షాపు యజమాని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోమన్నాడని అన్నారు. దీంతో శ్రీ నటరాజ్ ట్రేడర్స్ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తూప్రాన్ లోని రైతు వేదిక వద్ద గల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ ఉన్న అధికారి తన దరఖాస్తును తీసుకోనని చెప్పారని బాధితుడు వివరించాడు. దాంతో జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై మండల వ్యవసాయ శాఖ అధికారి గంగుమల్లును వివరణ అడగగా ఉప్పు లింగాపూర్ రైతు ప్రభాకర్ తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, వెల్దుర్తి వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశాడని చెప్పారు. తమకు రాతపూర్వక ఫిర్యాదు చేస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

Next Story