మురుగు నీటితో బేజారవుతున్న స్థానికులు

by Aamani |
మురుగు నీటితో బేజారవుతున్న స్థానికులు
X

దిశ,జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీవాసులు కొంతకాలంగా మురుగు నీటితో బేజారవుతున్నారు. నెలల తరబడి మురుగు నీరు ముందుకు సాగకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. తరచూ పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో విష జ్వరాలు ప్రభులే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీ వర్షపు నీటి మడుగులో కూరుకుపోయింది. దీంతో కాలనీవాసుల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్నప్పటికీ మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తో మురుగునీరు ముందుకు సాగడం లేదు. రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నిర్మించిన కల్వర్టు లో నుంచి మురుగునీరు ముందుకు సాగడం లేదు. వర్షం కురిసిన సందర్భాల్లోనే కొంతమేర వర్షపు నీరు మడుగు బయటకు దాటుతున్నప్పటికీ మిగతా సందర్భాల్లో కల్వర్టు దాటలేకపోతున్నాయి. కల్వర్టును మురుగునీటిపారుదలకు అనువుగా తీర్చిదిద్దాలని లేనిపక్షంలో కల్వర్టు కు సమాంతరంగా దాని పక్కలో నుంచి జేసీబీ సహాయంతో మరో కాలువ తవ్వించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..

ఇటీవల మున్సిపల్ అధికారులు కాలనీని సందర్శించి మురుగునీటి సమస్యను తెలుసుకున్నారు. మురికి నీరు వెళ్లే విధంగా తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఈ సమస్య నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షపు నీటి పారుదలకు స్థానికంగా సరైన వ్యవస్థ లేకపోవడంతో లోతట్టు ప్రాంతంలో మురుగు నీరు చేరుతుంది. వర్షాలు కురిసినప్పుడు మురుగునీటితో కలిసిన వర్షపు నీరు భారీ చెక్ డాంను తలపిస్తుంది. ఇదిలా ఉండగా ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య మరింత తీవ్రమైనట్లు ఆరోపిస్తున్నారు. మురుగు నీటి కాలువ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో మురుగు నీరు ముందుకు సాగడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మురుగునీటి చెరువుగా మారి కాలనీ వాసులకు సమస్య ఆత్మకంగా పరిణమించింది. క్రమంగా ఇక్కడి మడుగులో క్రిమి కీటకాలు, పాములకు నిలయం అవుతుంది. వాటితో సహవాసం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని మురుగునీరు తరలేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed