పేదలను ముంచి.. కార్పొరేట్లకు దొచిపెడుతున్న మోదీ: మంత్రి హరీష్ రావు ఫైర్

by Shiva |
పేదలను ముంచి.. కార్పొరేట్లకు దొచిపెడుతున్న మోదీ: మంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రధాని మోదీ పేద ప్రజలపై భారం మోపుతూ.. బడా పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నాడని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నంగునూరు మండలం కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా.. చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. గ్యాస్ ధర పెంపు, నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప ప్రధాని మోదీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విదేశాల్లోని నల్ల ధనాన్ని తీసుకొచ్చి జనధన్ ఖాతాలో ధనాధన్ డబ్బులెస్తానంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతలు నేడు ఆ విషయం మరిచారని గుర్తు చేశారు. మత విద్వేశాలు రెచ్చగొట్టెలా బీజేపీ నేతలు సమాధులను తవ్వమంటుంటే.. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా బలమైన పునాదులు వేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అంటే బీదల, రైతుల, సామాన్య మధ్య తరగతి పార్టీ అని అభివర్ణించారు.

ఎనమిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో విద్యుత్, సాగు నీరు, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం ఎదురుచూపులు తప్పలేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కోసం నెలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2వేల కోట్లు ఖర్చు చేసి ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కల్యాణ లక్ష్మీ, వృద్ధాప్య ఫించన్లు, రైతు బంధు, రైతు బీమాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం నీళ్లు జిల్లాకు తీసుకొచ్చి నంగునూరు మండల పరిధిలో యాసంగిలో 30 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్లు వివరించారు.

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండాకాలంలో చెరువులు మత్తడి దూకుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో 4.95 మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ రోజా శర్మ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో అత్యున్నత మెజారిటీతో గెలుపొందేలా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జడ్జీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్, నాయకులు, ప్రజాప్రతినిధులు జాప శ్రీకాంత్ రెడ్డి, వంగ నాగిరెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, కొల రమేష్ గౌడ్, దువ్వల మల్లయ్య, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed