ఊరికే కూల్చలే.. తప్పని పరిస్థితుల్లోనే పేదల ఇండ్ల కూల్చివేతలు

by Mahesh |
ఊరికే కూల్చలే.. తప్పని పరిస్థితుల్లోనే పేదల ఇండ్ల కూల్చివేతలు
X

దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్ చెరు: ఐలాపూర్, ఐలాపూర్ తండాలో ఇండ్ల కూల్చివేతపై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. మంగళవారం అమీన్ పూర్ లో బాధితులు, అధికారులు, మీడియాతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు వెల్లడించారు. అధికారులకు పేదల ఇండ్లు కూల్చివేయాలని ఎందుకుంటుందని, ప్రభుత్వ స్థలంలో ఇండ్ల నిర్మాణం జరిగిందనే ఫిర్యాదులు రావడంతోనే అధికారులు కూల్చివేశారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో దళారుల చేతిలో మోసపోయి ఇండ్ల నిర్మాణం చేసిన బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వ పెద్దలతో చర్చించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నిజాం నవాబుల కాలంలో ఐలాపురం గ్రామ పరిధిలోని 1200 ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రంగా వినియోగించే వారని, స్వాతంత్ర్యానంతరం తామే భూమి యజమానులమంటూ పలువురు కోర్టును ఆశ్రయించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టు స్టేటస్కో విధించినట్లు చెప్పారు.

ఈ తరువాత కొందరు విద్యుత్ ఉద్యోగులు సొసైటీగా ఏర్పడి రాజగోపాల్ నగర్ పేరుతో భూములు కొనుగోలు చేశారన్నారు. అయితే ఆ సమయంలో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలని, ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదనే కోర్టు ఆదేశాలున్నాయి. తుది తీర్పు వచ్చేవరకు ఇవే ఆదేశాలు కొనసాగుతాయని అప్పటి కోర్టు ఉత్తర్వులను గుర్తు చేశారు. 2001లో తాను పటాన్​చెరు ఎంపీపీ గా ఉన్నప్పుడు అప్పటి జాయింట్ కలెక్టర్ భీం నాయక్ సమక్షంలో గ్రామానికి చెందిన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించామని మహిపాల్ రెడ్డి చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందడంతో కొందరు దళారులు స్థానిక పరిస్థితులపై అవగాహన లేని నిరుపేదలను, దినసరి కార్మికులను, రోజు కూలీ పేదలకు రెండు గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి నోటరీలపై అమ్మకాలు జరిపారన్నారు.

ఐలాపూర్, ఐలాపూర్ తండా పరిధిలో ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఇండ్లు నిర్మాణం చేస్తున్నారని 52 మంది వ్యక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం, భూ పరిపాలన విభాగం, రెవెన్యూ శాఖ, కలెక్టర్, స్థానిక అధికారులు, హైకోర్టుకు ఫిర్యాదులు చేయడం అందాయని చెప్పారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలని కోర్టు ఆదేశించిందని, ఈ మేరకే కూల్చివేతలు జరిగాయని చెప్పారు. తెలిసి తెలియక, కోర్టు ఉత్తర్వులపై అవగాహన లేక స్థలాలను కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నష్టపోయిన నిరుపేదలకు తాను అండగా ఉంటానని మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు.

కోర్టు తుది తీర్పు రైతులకు అనుకూలంగా వస్తే నోటరీలపై కొనుగోలు చేసిన బాధితులందరికీ రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు ప్రభుత్వం అందించే గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి అవకాశాన్ని రాజకీయం చేయాలనుకునే ప్రతిపక్ష పార్టీ నాయకులు రెచ్చగొట్టేందుకు వస్తారని, అలాంటి వారి మాయ మాటలను నమ్మవద్దని, ఓపికతో ఉండాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అమీన్​పూర్​ ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి, ఐలాపూర్ సర్పంచ్ మల్లేష్, ఐలాపూర్ తండా నాయకులు రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story