కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో మంత్రి తలసాని

by Shiva |
కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో మంత్రి తలసాని
X

దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈడీ, సీబీఐలను అడ్డు పెట్టుకొని బీజేపీ ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తుందని ఆరోపించారు. తాము దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే.. బీజేపీ దేవుళ్లతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని, ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదన్నారు. రూ.వేల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని, అమాయకురాలైన ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేసి ఈడీ దాడులు చేయించడం సరికాదన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవితమ్మను కించపరిచేలా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్లన్న ఆలయ చైర్మన్ భిక్షపతి, ఈవో బాలాజీ, జడ్పీటీసీ సిద్ధప్ప, ప్రధాన అర్చకులు మల్లికార్జున్, ధర్మకర్తలు నర్ర రఘువీరారెడ్డి, బోయిన సాయి, కందుకూరి సిద్ధిలింగం, కాసర్ల కనకరాజు, సిద్ధిరాములు, సౌజన్య, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed