వ్యర్ధాలతో నిండి కంపు కొడుతున్న కోమటికుంట..

by Sumithra |
వ్యర్ధాలతో నిండి కంపు కొడుతున్న కోమటికుంట..
X

దిశ, నర్సాపూర్ : నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు చెరువులు, కుంటలను కాపాడుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు ఎందుకో మరి అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వివరాల్లోకెళితే నర్సాపూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కోమటికుంట ఒకప్పుడు శుద్ధమైన జలాలతో కలకలలాడేది. కానీ నేడు వ్యర్థ పదార్థాలతో కంపు కొడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కోమటికుంట పక్కనే ఉండే కాలనీవాసులు చెత్తాచెదారాన్ని ఇష్టారీతిగా పెద్దఎత్తున కోమటికుంటలో పారబోయడంతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది సైతం చెత్తను కుంటలోనే వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దాంతో వ్యర్ధ పదార్థాలు కుల్లిపోయి దుర్గంధం వెదజల్లి దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. కుంటలోని నీరంతా కలుషితమవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యర్థ పదార్థాలు ప్రధాన రోడ్డుపక్కనే ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇతర మండలాలకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, స్థానిక మున్సిపల్ చైర్మన్ సైతం రాకపోకలు సాగిస్తున్నప్పటికీ కుంట పై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోమటికుంటలో నిండిపోయిన వ్యర్ధ పదార్థాలను తొలగించి సుందరీకరణ చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed