ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇవే

by Harish |
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇవే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో శనివారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో 2025-27 సర్కిల్‌కు సంబంధించి నిబంధనలు ఖరారయ్యాయి. ప్రస్తుత జట్టు నుంచి ఫ్రాంచైజీలు నేరుగా గరిష్టంగా ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వీలు కల్పించారు. ఇప్పటివరకు గరిష్టంగా నలుగురిని మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉండేది. రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎం) నిబంధనను తిరిగి తీసుకొచ్చారు. ఆర్‌టీఎం ద్వారా ఒకరిని తిరిగి పొందొచ్చు. రిటెన్షన్, ఆర్‌టీఎంను ఉపయోగించి ఆరుగురి ఆటగాళ్లను తమ జట్టుతోనే ఉంచుకోవచ్చు. మొత్తం ఆరుగురి ప్లేయర్లలో కచ్చితంగా ఒకరు అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. గరిష్టంగా ఇద్దరిని తీసుకోవచ్చు. మిగతా ఐదుగురిని భారత, విదేశీ ఆటగాళ్లలో ఎవరినైనా అంటిపెట్టుకోవచ్చు. రిటైన్షన్ నిబంధనల్లో ఓవర్సీస్ ప్లేయర్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. మరోవైపు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాలని నిర్ణయించారు.

పర్సు వాల్యూ పెంపు

మెగా వేలంలో ఫ్రాంచైజీల పర్సు వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. 2022 మెగా ఆక్షన్‌లో పర్సు వాల్యూ రూ. 90 కోట్లుగా ఉండేది. దాదాపు 34 శాతం పెంచారు. అలాగే, రిటెన్షన్ స్లాబ్‌లను కూడా ఖరారు చేశారు. ఐదుగురి ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి రూ. 75 కోట్లు వెచ్చించాలి. మొదటి మూడు స్లాబ్‌లు రూ. 18 కోట్లు, 14 కోట్లు, రూ. 11 కోట్లుగా నిర్ణయించగా.. మిగతా రెండు స్లాబ్‌ల కోసం రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు వెచ్చించాలి.

ఆ రూల్ మళ్లీ

అన్‌క్యాప్డ్ రూల్‌ను తిరిగి తీసుకొచ్చారు. రిటైర్మెంట్ ప్రకటించినా లేదా గత ఐదేళ్లలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడని, ఐదేళ్లుగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందని ప్లేయర్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించనున్నారు. ఇది కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తించనుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలంటే రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్ 2008-21 వరకు అమల్లో ఉంది.

ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు

ఐపీఎల్‌లో ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు ఇవ్వాలని బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ. 7.50 లక్షలు ఇవ్వనుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా మ్యాచ్ ఫీజు అందనుంది. అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు మ్యాచ్ ఫీజుల ద్వారా రూ.1.05 కోట్లు పొందొచ్చు. కాంట్రాక్ట్ మొత్తానికి ఇది అదనం. మ్యాచ్ ఫీజుల కోసం ప్రతి ఫ్రాంచైజీ రూ. 12.60 కోట్లు కేటాయించనుంది.

వారిపై వేటు

మెగా వేలంలో విదేశీ ఆటగాళ్లు కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వారిని తర్వాతి ఏడాది వేలంలోకి అనుమతించరు. అలాగే, వేలంలో రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్లు లేదా వేలంలో ఎంపికైన ప్లేయర్లు సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో ఉండకపోతే వారిపై రెండు సీజన్లు ఆడకుండా, వేలంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు.

Advertisement

Next Story

Most Viewed