కమనీయం..సీతారాముల కల్యాణం..ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు

by Kalyani |   ( Updated:2023-03-30 13:32:34.0  )
కమనీయం..సీతారాముల కల్యాణం..ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని దేవాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదికపై ఆశీనులు గావించి, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వద్ద వంశ పారంపర్య అర్చకులు వేముగంటి రఘునందనా చార్యలు, వంశీ కృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అంతకు అలయంలో ద్వారతోరణ కుంభారాధన, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవం రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ హనుమాన్ దేవాలయంలో, శ్రీనగర్ కాలనీలోని దక్షిణ ముఖ హనుమాన్ దేవాలయంలో, హరిప్రియ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, శివాజీ నగర్ లోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో, సకల సిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో, హనుమాన్ నగర్ పవన సుత హనుమాన్ స్వామి దేవాలయంలో, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో, గాంధీ నగర్ లోని శ్రీ ప్రసన్నంజానేయ స్వామి దేవాలయంలో, సంతోష్ నగర్ అష్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో, సుభాష్ నగర్ శ్రీ దాసంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అదే విధంగా గణేశ్ నగర్ ప్రసన్నంజానేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి గద, పట్టు వస్త్రాలను సమర్పించి సీతారాముల కల్యాణోత్సవంతో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో..

శ్రీ రామనవమి పండుగ పురస్కరించుకొని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో బీజేపీ నాయకుడు చక్రధర్ గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు. 2వ వార్డు నర్సాపూర్ లో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed