ముందే తెలిసి మూసేశారు...

by Sridhar Babu |
ముందే తెలిసి మూసేశారు...
X

దిశ, పాపన్నపేట : జిల్లా కేంద్రం నుంచి వైద్య బృందం వస్తుందని తెలిసి ఆర్ఎంపీలు, పీఎంపీలు ముందుగానే క్లీనిక్​లు మూసివేసి పరారయ్యారు. దాంతో వీరికి ముందే సమాచారం తెలిసిందని అర్ధమవుతుంది. ప్రథమ చికిత్స కేంద్రాలలో ప్రాథమిక వైద్యాన్ని మాత్రమే అందించాలి. కానీ పాపన్నపేట మండల పరిధిలోని పలు ప్రాథమిక చికిత్స కేంద్రాలలో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్, స్థిరైడ్స్ వాడి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు అందడంతో శనివారం ఉదయమే జిల్లా వైద్య బృందం ఆర్ఎంపీ, పీఎంపీ ఆసుపత్రులను తనిఖీ చేపట్టడానికి పాపన్నపేటకు చేరుకున్నారు. ఈ విషయం వారికి ముందే అందడంతో ప్రాక్టీస్ కేంద్రాలన్నీ మూసుకున్నారు.

జిల్లా వైద్య బృందం పాపన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించిన అనంతరం నార్సింగ్ కి వెళ్లారు. నార్సింగ్ లో అన్ని కేంద్రాలు మూసివేయడంతో అధికారులు ఏమీ చేయలేక సాయంత్రం వరకు వేచి ఉండి వెనుతిరిగారు. జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ రమా, డీపీఎంఓ కోట, సీహెచ్ ఓ చందర్, వైద్య సిబ్బంది రాజశ్రీ, క్రాంతి, శ్రీనివాస్ రెడ్డిలు పలు రక్తపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడకూడదు అన్నారు. విష జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో కేంద్రాలలో బెడ్స్ ఏర్పాటు చేసుకొని సెలైన్ లు ఎక్కించడమే కాకుండా రకరకాల మందులు వాడి, ప్రాణాలకు ముప్పు తేవద్దన్నారు. ప్రైమరీ స్టేజీలోనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపాలని సూచించారు. ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేసి ప్రాణం పోయే దశలో ఇతర హాస్పిటళ్లకు రెఫర్ చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయన్నారు. ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీల పై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

Next Story