- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండలు పగులుతున్నయ్.. రైతు గుండెలు మండుతున్నయ్
దిశ, సంగారెడ్డి బ్యూరో/ఝరాసంగం/పటాన్ చెరు: ప్రభుత్వానికి చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం అక్రమ క్వారీ నిర్వాహకుల జేబుల్లోకి వెళుతున్నాయి. క్వారీ చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి విస్తీర్ణం చాలా తక్కువ మేరకు ఉంటుంది. దానికి మూడు, నాలుగు రెట్ల మేరకు కొండలను పేల్చుతున్నారు. కొండ ఎత్తు మూడు నుంచి నాలుగు వందల మీటర్లు ఉంటే దాని కింద సుమారు రెండు నుంచి మూడు వందల మీటర్ల లోతు వరకు తొలిచేస్తున్నారు. ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను రాళ్లుగా మార్చి కోట్లు కూడబెట్టుకొంటున్నారు.
మైనింగ్ అధికారులు క్వారీల వైపు సీరియస్ గా చూసినా దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కంకర క్వారీల నిర్వాహకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చాలాచోట్ల అనుమతులు లేని చోట, అసైన్డ్ భూముల్లో క్వారీలు నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఎత్తున కంకర కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యంత్రాలతో పంట పొలాలపై దుమ్ము పడటం, పేలుళ్ల శబ్ధంతో ఇళ్లకు బీటలు వారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 66 కంకర క్వారీలు 276.51 ఎకరాల ప్రభుత్వ భూమి, 36.52 ఎకరాల పట్టా భూమిలో విస్తరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని పటన్ చెరువు, జిన్నారం, హత్నూర, కంది, న్యాల్ కాల్, మండలాల్లో ఎక్కువ క్వారీలు ఉన్నాయి. అనుమతించిన స్థలం పక్కన ఉన్న భూములు కొనుగోలు చేసి వాటిలోనూ తవ్వకాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోకుండా స్థానిక రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
గ్రామాల వారీగా ఇలా...
జిన్నారం మండలంలోని ఖాజిపల్లి, మాదారం, రాళ్లకత్వలో 20 క్వారీలు ఉన్నాయి. వీటివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికుల ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. కొత్తవి ఏర్పాటు చేయొద్దు.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరువు మండలం లకుడారం, కంది మండలం ఎర్థనూరులో అసైన్డ్ భూమిల్లోనూ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. హత్నూర మండలం హత్నూర్, బ్రాహ్మణ గూడ, నాగుల దేవులపల్లి, గుండ్ల మాచనూర్, తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యాల్ కల్ మండలంలోని మాడిగి శివారు నుంచి నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, మహారాష్ట్రకు భారీగా కంకర తరలిపోతుంది.
పలుమార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామ శివారు, ఈద్దులపల్లిలో సైతం కంకర క్వారీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. పంటలు దెబ్బ తింటున్నాయని రైతులు అభ్యంతరాలను నిర్వాహకులు, అధికారులు లెక్క చేయడం లేదు. ఈ ప్రాంతంలో భారీ లారీల్లో కంకర తరలింపు వల్ల రహదారులన్నీ గుంతల మయంగా మారి ఛిద్రమవుతోంది.
క్రషర్ల కాలుష్యంతో లకుడారం ఆగమాగం..
సంగారెడ్డి జిల్లాలో క్రషర్లు అంటే ప్రధానంగా అందరి చూపు లకుడారం వైపు మల్లుతోంది. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో పాటు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పెద్ద ఎత్తున క్రషర్లు వెలుస్తున్నాయి. క్రషర్ల యాజమాన్యాలు నిబంధనలను గాలికి వదిలేసి కనీస ప్రమాణాలు పాటించకుండా నడిపిస్తుండడంతో లకుడారం కాలుష్యానికి అడ్డాగా మారింది. ఇప్పటికే ఉన్న క్రషర్ల కాలుష్యంతో గ్రామస్తులు గగ్గోలు పెడుతుంటే అనుమతులు పొందిన యాజమాన్యాలు తీసుకున్న అనుమతులకు భిన్నంగా ఎక్కువ క్రషర్ మిషన్లను నడుపుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు అధికారులు మాత్రం రోజుకొక్క కొత్త క్రషర్ క్వారీలకు అనుమతులు ఇస్తూ ప్రజల రక్షణను గాలికొదిలేస్తున్నారన వాదనలు వినిపిస్తున్నాయి.
క్వారీల్లో అనుమతులకు విరుద్ధంగా చేస్తున్న బ్లాస్టింగ్‌లతో పెద్ద ఎత్తున శబ్ధ కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు గ్రామంలో ఇళ్లకు బీటలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే పంటలు పండక వ్యవసాయం కుంటుపడిందని వాపోతున్నారు. పశుపక్ష్యాదులకు సైతం గడ్డి దొరకక పక్క గ్రామాల వైపు వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు క్రషర్ దుమ్ముతో తీవ్ర అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా ఆస్తమా, దగ్గు, ఎలర్జీల వంటి రోగాలతో నిత్య సహవాసం చేస్తున్నామని వాపోతున్నారు.
చిన్న రోడ్డు.. హెవీ లోడ్..
గ్రామంలోని రోడ్డు 24 గంటలు దుమ్ము ధూళితో నిండి ఉండటంతో ప్రయాణం చేయాలంటేనే గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కాసుల కక్కుర్తితో క్రషర్ల యాజమాన్యాలు పరిమితికి మించి హెవీ లోడ్ తో వాహనాలను నడపడంతో రోడ్లు పాడవడంతో పాటు, అతివేగం అజాగ్రతతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. క్రషర్ లారీలన్ని బడా బాబులవి కావడంతో హెవీ లోడ్, అతివేగాన్ని నియంత్రించాల్సిన రవాణా శాఖ అధికారులు మిన్నకుండి పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తగ్గిపోతున్న భూగర్భ జలాలు..
క్రషర్ క్వారీల్లో మైనింగ్ పూర్తి అయ్యాక గుంతలను క్రషర్ యజమాన్యాలే పూడ్చి వేయాలి. అయితే ఈ నిబంధనను సదరు యాజమాన్యాలు గాలికి వదిలేసి క్వారీలను అలాగే వదిలేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో చెరువులోకి చేరాల్సిన నీరంతా క్వారీల్లో నిండుతుంది. దీంతో లకుడారం గ్రామంలో వ్యవసాయం కుంటు పడటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ ల యాజమాన్యాలకు మైనింగ్ చేసి డబ్బు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ మైనింగ్ పూర్తయ్యాక వారిని పూడ్చడంలో లేదంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కలగజేసుకొని మైనింగ్ పూర్తయిన క్వారీలను పూడ్చివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలతో మాకేం పని..
క్రషర్లతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్న లకుడారం గ్రామస్తులు కొత్త క్రషర్లకు అనుమతులు నిలిపివేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అయితే ప్రజల భద్రత మాకేం పని అన్న రీతిలో రోజుకొక కొత్త క్రషర్ కి అనుమతులు ఇస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. లకుడారం గ్రామంలో పెద్ద చెరువు కింద కనీస నిబంధనలను పక్కనపెట్టి క్వారీని కేటాయించారని గ్రామస్తులు అగ్రహిస్తున్నారు. మైనింగ్, పొల్యూషన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి పూర్తి వివరాలు అందజేయాలని సాక్షాత్తు కలెక్టర్ ఆదేశించినా ఇప్పటివరకు సర్వే రిపోర్ట్ ను అందజేయలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. సర్వే రిపోర్ట్ అందే వరకు క్వారీ పనులను నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి క్వారీ పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ క్వారీతో పెద్ద చెరువుకు ప్రమాదం ఏర్పడితే లకుడారం ఎడారిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. క్వారీ అనుమతి రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు 35 రోజులుగా వరుసగా దీక్షలు చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో గతంలో జిన్నారం మండలంలో సైతం క్వారీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి రైతులు రోడ్డుపై బైఠాయించారు. అయితే క్రషర్లు రాజకీయ పలుకుబడి కలిగిన నేతలవి కావడంతో ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసిన అధికారులు కనీసం పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.