కేటీఆర్ ను సీఎం చేస్తే.. మొదట జంపయ్యేది హరీషే : బీజేపీ చీఫ్ బండి సంజయ్

by Shiva |   ( Updated:2023-04-07 15:03:00.0  )
కేటీఆర్ ను సీఎం చేస్తే.. మొదట జంపయ్యేది హరీషే : బీజేపీ చీఫ్ బండి సంజయ్
X

సీఎంకు 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా.. కేటీఆర్ భవిష్యత్తు ముఖ్యమా

దిశ సిద్దిపేట ప్రతినిధి: కేటీఆర్ ను సీఎం చేస్తే.. మొదట జంపయ్యేది హరీషే రావేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సిద్దిపేటలో అమర వీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాగుబోతుల చేతుల్లో రాష్ట్రం బంది అయ్యిందన్నారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ, పదో తరగతి ప్రశ్నాపత్రం పేపర్ల లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీకేజీ ఘటనలో నష్టపోయిన విద్యార్థులకు రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలన్నారు. ఈ మూడు ప్రధాన అంశాల పరిష్కారమే ధ్యేయంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమైందన్నారు. ఇప్పటి వరకు 21 నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఒక్క నోటిఫికేషన్ సైతం సరిగ్గా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ, పది పరీక్షా పత్రాల లీకేజీ విషయాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాల కోసం పోరాడితే ప్రభుత్వం తనను నిర్దాక్షిన్యంగా జైలుకు పంపిందని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 1,400 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు మంత్రి హరీష్ రావే ప్రధాన కారణమని ఆరోపించారు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకని ఘటనపై అంతర్జాతీయ సంస్థలతో విచారణ జరిపించాలని ఎద్దేవా చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమో.. మంత్రి కేటీఆర్ భవిష్యత్తు సీఎం నిర్ణయించుకోవాలన్నారు. ఒక వేళ మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తే బీఆర్ఎస్ నుంచి మొదటగా జంపయ్యేది మంత్రి హరీష్ రావేనని జోస్యం చెప్పారు. నిరుద్యోగ యువత కోసం బీజేపీ చేసే యుద్ధంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ లను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటగా వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు ప్రజలు బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయకులు చక్రధర్ గౌడ్, జనపురెడ్డి సురేందర్ రెడ్డి, కొత్తపల్లి వేణుగోపాల్, జనార్ధన్, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story