హౌసింగ్ బోర్డు కాలనీ.. పార్క్ స్థలాలు హాంఫట్

by Prasanna |
హౌసింగ్ బోర్డు కాలనీ.. పార్క్ స్థలాలు హాంఫట్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన పార్క్ స్థలాల అన్యాక్రాంతంపై మున్సిపల్ అధికారులు సీరియస్ అవుతున్నారు. బల్దియా ఆధీనంలోని స్థలాలకు రెవెన్యూ శాఖ అధికారులు 59 జీవోలో పట్టా సర్టిఫికెట్ల జారీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్కు స్థలాల అన్యాక్రాంతంపై మున్సిపల్ అధికారులు దూకుడు పెంచడంతో రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో సదరు స్థలాలను ఆక్రమించుకున్న అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 1340 లో 1999 లో హౌసింగ్ లోయర్ ఇన్ కమ్ గ్రేడ్(ఎల్ ఐ జీ) కాలనీ పేరిట 15 ఎకరాల్లో నాటి ప్రభుత్వం వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులోని ప్లాట్‌లను నాటి ధరలకు అనుగుణంగా విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. సదరు కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 10 శాతం స్థలం పార్కులు ఇతర అవసరాల నిమిత్తం 7 చోట్ల 1 ఎకరం 5 గుంటల స్థలం మున్సిపల్ కు కేటాయించారు. సదరు స్థలాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఒక చోట పట్టణ ప్రకృతి వనం, మరొక చోట చిల్డ్రన్ పార్క్, మరో చోట హరిత వనం, ఓ చోట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. మున్సిపల్ అధికారులు రికార్డుల ప్రకారం మరో 3 చోట్ల ఖాళీ స్థలాలు ఉండాలి. కానీ సదరు స్థలాలు ఆక్రమణలకు గురైనట్లు స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు సదరు స్థలాలకు జీవో 59 ప్రకారం పట్టా సర్టిఫికెట్లు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.

59 జీవోలో పట్టా సర్టిఫికెట్లు..?

మున్సిపల్ స్థలాలకు రెవెన్యూ అధికారులు పట్టా సర్టిఫికెట్ల జారీపై మున్సిపల్ ఉన్నతాధికారి సీరియస్ అయ్యారు. హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి మున్సిపల్ శాఖ కు కేటాయించిన స్థలాలకు సంబంధించి ఎంత స్థలానికి జీవో 59 ప్రకారం పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారో సమాచారం కోరాలని సదరు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అర్బన్ తహసీల్దార్ కు లేఖ రాశారు.

అక్రమార్కుల్లో గుబులు

మున్సిపల్ స్థలాలకు పట్టా సర్టిఫికెట్ల జారీపై మున్సిపల్ అధికారులు దూకుడు పెంచడంతో రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో సదరు స్థలాలను ఆక్రమించుకున్న అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుంది. తీగ లాగితే ఆక్రమణలకు సహకరించిన అధికారులతో పాటుగా ఆక్రమణ దారుల గుట్టు రట్టు అవుతుందని స్థానికులు వాపోతున్నారు. కోట్లు విలువ చేసే స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని కాలని వాసులు కోరుతున్నారు.

పట్టాలు రద్దు చేయాలని కోరుతాం

మున్సిపల్ స్థలాలకు 59 జీవో పట్టా సర్టిఫికెట్లు జారీ అయిన పక్షంలో పట్టాలు రద్దు చేయాలని కోరుతాం. మున్సిపల్ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Next Story

Most Viewed