జీతాలో చంద్రశేఖరా..!

by Mahesh |
జీతాలో చంద్రశేఖరా..!
X

పంచాయతీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 26 మండలాల్లో 499 గ్రామపంచాయతీలుండగా వీటి పరిధిలో పారిశుధ్య కార్మికులు, వాటర్​ మెన్​ ఎలక్ట్రీషియన్​, ట్రాక్టర్​ డ్రైవర్​, కారోబార్లతో కలిపి సుమారు 3 వేల మందికి పైగా మల్టీపర్పస్​ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.8500 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. అయితే గత కొన్ని నెలలుగా వేతనాలు రాక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో 13న కలెక్టరేట్​ ముట్టడికి సిద్ధమవుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. జీతాలో చంద్రశేఖరా..! అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పంచాయతీల్లో పనిచేసే కార్మికులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో జీవితం కొనసాగిస్తున్న గ్రామ పంచాయతీ కార్మకులకు 4 నెలలుగా జీతాలు రాక పోవడంతో కార్మికులు తిప్పలు పడుతున్నారు. పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాక కొందరు కార్మికులు అప్పుల పాలవుతున్నమని అవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులు..తమ వేతనాలను వెంటనే విడుదల చేయండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వెడుకుంటున్నారు. ఇటివలే జీతాల కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిగా, ఈనెల 13న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, వంట వార్పు కార్యక్రమం నిర్వహణకు సిద్దమవుతున్నారు. జిల్లాలో 26 మండలాల పరిధిలోని మొత్తం 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

ఈ గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్య కార్మికులు, వాటర్‌మెన్‌, ఎలక్ట్రీషియన్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌, కారోబార్లతో కలిపి సుమారు మూడు వేల మందికి పైగా మల్టీపర్పస్‌ సిబ్బంది పని చేస్తున్నారు. నెలకు రూ.8500 చొప్పున వీరికి వేతనాలు చెల్లిస్తున్నట్లు పంచాయతీ సిబ్బంది పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపు ప్రతీ నెల కోటి రూపాయలు పైగానే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు గ్రామ పంచాయతీల్లో ఇంటిపన్ను, వృత్తిపన్ను, రిజిస్ట్రేషన్‌లు, భూమి కిస్తు, వాహనాల పన్నులు వాటిలోకి కూడా వస్తోంది. ప్రస్తుతం నిధులు సకాలంలో రాకపోవడంతో గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.

నాలుగు నెలలుగా జీతాలు లేవు..?

పంచాయతీ కార్మికులకు సుమారు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పంచాయతీల అకౌంట్లలో పైసలు ఉన్నా ప్రభుత్వం నిధులను ఫ్రీజింగ్‌ చేయడంతో ట్రెజరీకి పంపిన చెక్కులు క్లియర్‌ కావడం లేదు. దీంతో పంచాయతీ కార్మికులకు, సిబ్బందికి సుమారు రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇచ్చే అతి తక్కువ జీతాలు కూడా నెలనెల రాకపోవడంతో కార్మికులు తిప్పలు పడుతున్నారు. పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్థానికంగా సెక్రెటరీలు, సర్పంచ్‌లు సర్దుబాటు చేస్తున్నారు. జీతాలు రాక కొందరు కార్మికులు అప్పులు చేస్తున్నారు. జీతాల కోసం పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు.

జీతాలు వెంటనే విడుదల చేయాలి

గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలి. కార్మికులకు ఇచ్చే వేతనాలు సకాలంలో చెల్లించని కారణంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు నెలనెలా చెల్లించాలని, కార్మికుల సమస్యల పరిష్కారమే ద్యేయంగా ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. 13న కలెక్టరేట్ ముట్టడి, వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నాం. గ్రామపంచాయతీ కార్మికులు జయప్రదం చేయాలి.:– తునికి మహేశ్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి..

Advertisement

Next Story

Most Viewed