అధికారులు అభివృద్ధిపై దృష్టి సారించండి

by Sridhar Babu |
అధికారులు అభివృద్ధిపై దృష్టి సారించండి
X

దిశ, హుస్నాబాద్ : అభివృద్ధి పనులపై అధికారులు పూర్తిగా దృష్టి సారించాలని, ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తానే తీసుకుంటానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో పాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మిషన్ భగీరథ ,ఇరిగేషన్, ఆర్ అండ్ బీ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, మత్స్యశాఖ, వ్యవసాయం, విద్యుత్తు ,డీఆర్డీఏ తో పాటు పలు శాఖలపై మంత్రి అధికారులతో ఐదు గంటల పాటు చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల పదవీకాలం

పూర్తయినందున అధికారులే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా శక్తివంచన లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. హుస్నాబాద్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎల్లమ్మ చెరువు, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం గండి, రాయికల్ జలపాతం, సర్వాయిపేట, పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర, కొత్తకొండ వీర భద్ర స్వామి దేవాలయం పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటానని అందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. విద్యుత్ సరఫరా లో ఎక్కడా అవాంతరం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గౌరవెల్లి దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు వైద్య పరంగా సహాయం అందించేందుకు

24 గంటల పాటు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ కి వెళ్తున్న వారిపై ఒక సర్వే ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్నదని, దానికి త్వరలోనే పరిష్కార మార్గం కనుక్కుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ ,ప్రబులు దేశాయి, రాధిక గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ కిరణ్ వెంకటరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి నియోజకవర్గంలోని మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story