ఆర్మూర్ విద్యుత్ డీఈ పై విచారణ...

by Kalyani |
ఆర్మూర్ విద్యుత్ డీఈ పై విచారణ...
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ డివిజనల్ ఇంజనీర్ (డీఈ) హరిచంద్ నాయక్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విద్యుత్ ఉద్యోగుల ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా చేసిన ఫిర్యాదు మేరకు బినామీ ఉద్యోగి బ్యాంకు ఖాతా పై ఏపీ టీఎస్ అధికారులు విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో తెలిసింది. విద్యుత్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు సీఎండీ ఆర్మూర్ విద్యుత్ డీఈ పై విచారణకు ఆదేశించారు. విద్యుత్ సంస్థలోని యాంటీ పవర్ త్రిఫ్ట్ స్క్వాడ్ (ఏపీ టీఎస్) సీఐ నేతృత్వంలోని బృందం విచారణ చేపడుతున్నారు. ఇటీవల గత వారం లో శుక్ర, శనివారాలలో విద్యుత్ ఉద్యోగులను పిలిచి విచారణ చేశారు. ఆర్మూర్ విద్యుత్ డీఈ కి ఆఫీసులో ఒక ఉద్యోగి బినామీగా వ్యవహరిస్తున్నారని విద్యుత్ ఉద్యోగుల ద్వారా భారీగా ఆరోపణల రూపంలో ఎన్ పీడీసీఎల్ సీఎండీ కి ఫిర్యాదులు అందాయి.

ఆరోపణల నేపథ్యంలో బినామీ గా వ్యవహరించిన ఆ ఉద్యోగి వివరాలు తీసుకుని అతని బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే నిజానిజాలు తేటతెల్లం అవుతాయని ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నట్లు తెలిసింది. బినామీ గా వివరించిన ఆ ఉద్యోగి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా విద్యుత్ డీఈ కి డబ్బులు వచ్చాయా లేదా అనే అంశంతో పాటు ఇతర విషయాలపై విచారణ పూర్తిస్థాయిలో నిశితంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగులు ఆకాశ రామన్న ఉత్తరాలు రాసి ఆర్మూర్ విద్యుత్ డీఈ పై సీఎండీ కి ఫిర్యాదు చేసిన అంశాలు విచారణలో వెలుగులోకి వస్తాయా లేదా అనే విషయంపై ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యుత్ డీఈ పై విద్యుత్ ఉన్నదా అధికారులు గోప్యంగా చేస్తున్న విచారణలో ఉద్యోగులు ఏ మేరకు వాస్తవాలను చెప్పారో అన్నది నివేదిక వెలువరించే సమయంలోనే తెలియనుంది.

Advertisement

Next Story