లండన్ మ్యూజియంలో ఉన్న ఛత్రపతి శివాజీ ఆయుధం అసలైనది కాదు: హిస్టారియన్ ఇంద్రజిత్

by S Gopi |
లండన్ మ్యూజియంలో ఉన్న ఛత్రపతి శివాజీ ఆయుధం అసలైనది కాదు: హిస్టారియన్ ఇంద్రజిత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌ వాడిన 'వాఘ్‌‌నఖ్’(పులిపంజా బాకు)ను మహారాష్ట్ర ప్రభుత్వం లండన్‌లోని మ్యూజియం నుంచి తీసుకురావాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అది అసలైనది కాదని చరిత్రకారులు ఇంద్రజిత్ సావంత్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ వాడిన పులిపంజా బాకు రాష్ట్రంలోని సతారాలోనే ఉందని పేర్కొన్నారు. 1659లో బీజాపూర్ సుల్తానేట్ సైన్యాధ్యక్షుడు అఫ్జల్ ఖాన్‌ను హతమార్చేందుకు శివాజీ వాడిన ఈ పంజా బాకును తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది లండన్‌లోని మ్యూజియంతో అవగాహన ఒప్పందంపై సంతం కూడా చేసింది. 'వాఘ్ నఖ్' అనేది రాజు బలం, పరాక్రమానికి శాశ్వతమైన, గౌరవప్రదమైన చిహ్నం. ఇది బలమైన ప్రత్యర్థిని అణచేందుకు, చంపేందుకు అప్పట్లో ఉపయోగించారు. అయితే, 'తన లేఖకు ఇచ్చిన సమాధానంలో లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం 'వాఘ్ నఖ్' తన అధీనంలో ఉన్నట్టు ఆధారాలు లేవని ' పేర్కొందని సావంత్ విలేకరులతో చెప్పారు. నిజమైన వాఘ్ నఖ్ సతారాలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. మరో పరిశోధకులు పాండురంగ్ బాల్కవాడే మాట్లాడుతూ.. ప్రతాప్‌సిన్హ్ ఛత్రపతి తన వ్యక్తిగత సేకరణలోని వాఘ్ నఖ్‌ను 1818-1823 మధ్య బ్రిటీషర్ గార్న్ట్ డాఫ్‌కు ఇచ్చాడని, డఫ్ వారసులు దాన్ని మ్యూజియంకు అందించారని చెప్పారు. అయితే, డఫ్ భారత్‌ను విడిచివెళ్లిన తర్వాత ప్రతాప్‌సిన్హ్ చాలామందికి 'వాఘ్ నఖ్'ను చూపించారని సావంత్ తెలిపారు. ఇంద్రజిత్ సావంత్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శంభురాజ్ దేశాయ్.. 'భవానీ తల్వార్ ', 'వాఘ్ నఖ్' లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం వివరాలను ధృవీకరించి, ఆపై అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. చరిత్రకారులకు వేరే అభిప్రాయం ఉంటే ప్రభుత్వం వారికి వివరణ ఇస్తుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed