సంక్షేమానికి చిరునామా వైఎస్సార్: సీఎం రేవంత్ రెడ్డి

by Shiva |
సంక్షేమానికి చిరునామా వైఎస్సార్:  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమానికి చిరునామా వైఎస్సార్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సోమవారం గాంధీభవన్ జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగపడుతోందన్నారు. దేశంలో సంక్షేమం అంటే గుర్తు వచ్చే పేరు వైఎస్ఆర్ అని కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీ లు, నాయకులు వైఎస్ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకొని అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమంపై వైఎస్సార్ ముద్ర ఎంతో ఉన్నదన్నారు.

తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లకు స్ఫూర్తి వైఎస్సే అని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి కృష్ణా జలాలు, హైదరాబాద్ లో పెట్టుబడులకు కూడా వైఎస్సే స్ఫూర్తి అని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతుందన్నారు. 2009 లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ లక్ష్యం అని సీఎం గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాకుండానే వైఎస్ మనకు దూరం కావడం బాధాకరమన్నారు. వైఎస్ గతంలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్ర నే భారత్ జోడో యాత్రకు స్పూర్తి అని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ చేసిన పాదయాత్ర వలనే కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిందన్నారు.

ఇప్పుడు రాహుల్ చేసిన పాదయాత్ర తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చిందన్నారు. ఇక తాను 2021 జూలై 7 న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నానని, మూడేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసిన 35 మంది నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. ఎలాంటి ఫైరవీలు లేకుండా పార్టీ కోసం పని చేసిన, త్యాగం చేసిన వారికి పదవులు ఇచ్చామన్నారు. కష్టపడిన కార్యకర్తలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశం అని వివరించారు. కార్యకర్తలను కాపాడుకున్నపుడే పార్టీ బలంగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story