ప్రజలను కష్టాలనుండి గట్టెక్కిస్తా.. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్

by Sumithra |
ప్రజలను కష్టాలనుండి గట్టెక్కిస్తా.. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కరీంనగర్ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత తన పై ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎంపీ బండి సంజయ్ భరోసానిచ్చారు. సోమవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించి, మంజూరైన ఎంపీ నిధులతో నిర్మించనున్న పలు మహిళా సమాఖ్య, కుల సంఘ భవనాలకు భూమి పూజ చేశారు. ముందుగా సిరిసిల్ల పట్టణంలోని మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండప ప్రహరీ గోడ నిర్మాణానికి, తర్వాత వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణానికి, శాంతినగర్ గ్రామ గిరిజన కుల సంఘ భవన నిర్మాణానికి, అనంతరం ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి, తదనంతరం తంగేళ్లపల్లి మండల కేంద్రంలో గౌడ కుల సంఘ భవన నిర్మాణానికి ఆయా సంఘాల కుల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.

అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఒకరి పై ఒకరు విమర్శలు, ఆరోపణలు మానుకొని అభివృద్ధి పై దృష్టి సాధిద్దామని పిలుపునిచ్చారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందని, దానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇంచార్జి, అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్, ఆడ్ హక్ కమిటీ కన్వీనర్ అగ్గిరాములు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా కుల సంఘ పెద్దలు, సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

అన్ని కులాలకు సమాన నిధులిస్తా..

కులంలో ఉండే నిరుపేదలను ఆదుకున్నప్పుడే ఆ కుల సంఘాల మనుగడ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలను అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అన్ని కుల సంఘ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధులను సమానంగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఉపయోగపడే వాటికే ఎంపీ నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల కోసం నిధులు దుర్వినియోగం చేయకూడదని మోడీ చెప్పినట్లు గుర్తు చేశారు. తన గెలుపులో సిరిసిల్ల జిల్లా పాత్ర కీలకమని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారని తెలిపారు. 2 లక్షల 25 వేల భారీ మెజారిటీ గెలిపిస్తే, ప్రధాని మోడీ తనకు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారని, కేంద్ర మంత్రి పదవి వచ్చిందని తనకు ఎలాంటి అహంకారం లేదని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి అన్ని పథకాలు అందేలా చూసి, అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికిన గిరిజనులు..

సిరిసిల్ల పర్యటనలో భాగంగా వీర్నపల్లి మండలం వన్ పల్లి, శాంతినగర్ లో గిరిజన కులసంఘ భవన నిర్మాణానికి బండి సంజయ్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో ఊరంతా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. డప్పు, సప్పుల్లా మధ్య మహిళలు మంగళ హారతితో, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో అలరిస్తూ, పూలు జల్లుతూ స్వాగతం పలికారు. భూమి పూజ అనంతరం గ్రామ ప్రజలు ప్రజలతో కలిసి బండి సంజయ్ సహపంక్తి భోజనం చేశారు.

Advertisement

Next Story