రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

by Aamani |
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, మెదక్ ప్రతినిధి : ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా పిల్లి కొట్యల్ లో వైద్య కళాశాల ఎంబీబీఎస్ ప్రారంభోత్సవం అనంతరం వైద్యం వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ జిల్లా సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని వ్యవసాయ పరంగా రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించి రైతులకు సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని నిర్వహిస్తున్నారు కొనుగోలు సక్రమంగా నడుస్తుందా రవాణా విషయంలో తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనే విషయాలను జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా సమగ్ర నివేదికలు అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకొని పని చేయాలన్నారు. రుణమాఫీ కి సంబంధించి ఎంతమంది రైతులు లబ్ధి పొందారు, ఇంకా ఎవరెవరికి రుణమాఫీ చేయాల్సి ఉంది, బ్యాంకులతో ఏమైనా సమస్య ఉన్నదా , అనే విషయాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుని ఆదేశించారు, మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి కొనుగోలు సక్రమంగా నడుస్తుందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా జనసాంద్రత ఆధారంగా కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రతిపాదనలు పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed