రాహుల్ గాంధీ చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగం.. తెలంగాణలో అమలు కాదా..?

by Sumithra |
రాహుల్ గాంధీ చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగం.. తెలంగాణలో అమలు కాదా..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : నిరుద్యోగ యువత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన జీవో 55 ని రద్దు చేసి జీవో 29ని అమలు చేయడంతో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగమే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ సదస్సులు నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. జీవో 29తో రాజ్యాంగం ఖూనీ అవుతుందన్నారు. దళిత బహుజనులకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమా అని సూటిగా ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయం పై ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయాలన్నారు. యూపీఎస్సీలో అమలు జరిగే రాజ్యాంగం టీఎస్పీఎస్సీలో ఎందుకు అమలు కావడం లేదని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగులు అన్యాయం పై ప్రశ్నిస్తే టెరరిస్టులు, నక్సలైట్ల మాదిరి విద్యార్థులను అరెస్టులు చేయడం, లాఠీచార్జీలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆశోక్ నగర్ లో జరిగిన లాఠీఛార్జ్ పై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ పేరిట ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నాయకులు హామీల అమలు మరిచిపోయారని అన్నారు. నిరుద్యోగులకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం అందిస్తామని యూత్ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 పైసలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలన్నారు.

రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ.. సభలు సమావేశాలు నిర్వహిస్తే సరిపోదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అయ్యే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అనుసరించిన జీవో 55 ప్రకారమే ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పై అణచివేతలు అరెస్టులు లాఠీ చార్జీలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని చెప్పిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. నవీన్, రియాద్, ఆకునూరి మురళిలకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. వానాకాలం సంబంధించి రైతు భరోసా ఇవ్వమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించినట్లు తెలుస్తోందన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వక పోవడం అన్యాయం అన్నారు. కరోనా కష్ట కాలంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు రైతు బంధు అందించారని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ కోసం లక్ష యాబై వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయక పోవడం అన్నదాతలను దగా చేయడమే అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను రైతులు నిలదీయాలని పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed