దుబ్బాకకు నెంబర్ వన్ విలన్ హరీష్ రావు : ఎమ్మెల్యే

by Naresh |   ( Updated:2023-11-25 15:57:47.0  )
దుబ్బాకకు నెంబర్ వన్ విలన్ హరీష్ రావు : ఎమ్మెల్యే
X

దిశ, మిరుదొడ్డి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రం ఎక్స్ రోడ్డు వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగు రోజుల క్రితం ఇదే ఎక్స్ రోడ్ వద్ద ప్రచారం నిర్వహించిన మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చి వెళ్లడం తెలిసిందేనన్నారు. మంత్రిగా హరీష్ రావు, ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఇన్నేళ్లుగా అధికారంలో ఉండి దుబ్బాకను రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అక్బర్ పేట భూంపల్లిని మండల కేంద్రం ఏర్పాటు విషయంలోనూ వారు చేసింది ఏమీ లేదన్నారు. ఉప ఎన్నికల్లో ఇదే చౌరస్తా వద్ద భూంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పి, చేసి చూపించానని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మెదక్ లో కలెక్టర్ భవన ప్రారంభానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే రామాయంపేట డివిజన్ కావాలని అడగడంతో ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

మరి దుబ్బాక మీద ప్రేమ ఉంటే అదే స్టేజి మీద వున్న హరీష్ రావు, కేపీఆర్ దుబ్బాకని కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని ఎందుకు అడగలేకపోయారన్నారు, దుబ్బాకకు నెంబర్ వన్ విలన్ హరీష్ రావు అని ఎద్దేవా చేశారు. ఈసారి మళ్లీ అవకాశమిస్తే దుబ్బాకని రెవెన్యూ డివిజన్ చేయడానికి కృషి చేస్తానని అలాగే, అక్బర్ పేట భూంపల్లిని నియోజకవర్గంలోనే నెంబర్ వన్ మండల కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తన సొంత ఊరు బొప్పాపురం కూడా ఇదే మండలంలో ఉందని, ఆకారం, బొప్పాపురం, ఎనగుర్తి గ్రామస్తులు ప్రసిద్ధిగాంచిన కూడవెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే చుట్టూ తిరిగి రావాల్సిందేనని అన్నారు. తాను మళ్ళీ గెలిచాక తప్పకుండా రామలింగేశ్వర స్వామి గుడి వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులకు ఎన్నికలు రాగానే అన్ని గుర్తొస్తాయని, కానీ చేసేది ఏమీ లేదని అన్నారు.



కొత్తగా ఒక్క కూపన్ కార్డు, పెన్షన్లు ఇవ్వలేదని, దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలను అమలు చేయడంతో పాటు, రైతు రుణమాఫీ పూర్తి చేయలేకపోయిందని, ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. ఈనెల 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు అరిగే కృష్ణ, బీజేవైఎం నాయకులు జలంధర్ రెడ్డి, జిల్లా నాయకులు బిక్షపతి, నర్సింహులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story