Organics Factory : ప్రజల ప్రాణాలతో చెలగాటం..ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీ బరితెగింపు

by Aamani |
Organics Factory : ప్రజల ప్రాణాలతో చెలగాటం..ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీ బరితెగింపు
X

దిశ, సంగారెడ్డి : సదాశివపేట మండలం ఆరూర్ గ్రామ శివారులో ఉన్న ఎవరెస్టు ఆర్గానిక్స్ ఫ్యాక్టరీ బరి తెగించి కంపెనీ రసాయ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విడిచి పెడుతున్నారు. దీని వల్ల సమీప గ్రామ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరెస్టు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిపల్లి మండలం పెద్ద గోప్లారం గ్రామాన్ని కాలుష్యపు భూతం పట్టి పీడిస్తుంది.


వాయు, జల కాలుష్యానికి ప్రజలు సతమతమవుతున్నారు. కాలుష్యం,దుర్గంధం,దుర్వాసన,భూగర్భజలాల కలుషితం,పలు రుగ్మతలు, దిగుబడి రాని పంటలు, వంటి సమస్యలతో పెద్ద గోప్లారం కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, తమ పిల్లల జీవితాలు బాగుపడుతాయని భావించిన ఇక్కడి ప్రజలు.. కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కలుషితమైన లక్ష్మీనారాయణ చెరువు..

మునిపల్లి మండలం పెద్ద గోప్లారం గ్రామ శివారులో ఉన్న ఎవరెస్టు ఫ్యాక్టరీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సదాశివపేట మండల పరిధిలోని ఆరూర్ గ్రామ శివారులో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. పెద్ద గోప్లారం గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువు ఎవరెస్ట్ కంపెనీ కింది భాగాన ఉండడం, ఆ చెరువు కట్ట ను ధ్వంసం చేయడంతో కంపెనీ వదిలిన వ్యర్థ కెమికల్ జలాలు చెరువులోకి యదేచ్చగా వదలడంతో ఆ చెరువు నుంచి కింది గ్రామాలకు కాలుష్య జలాలు వెళుతున్నాయి. దీని వల్ల కింది గ్రామాల ప్రజలు సైతం కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్ద గోప్లారం గ్రామంలో భూగర్భ జలాలు సైతం ఎవరెస్టు పరిశ్రమ వదిలిన జలాల వల్ల కలుషితమై తాగేందుకు నీటిని కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది కేవలం మునిపల్లి మండల వాసులే.


పెద్ద గోప్లారం ప్రజలు తమ పొలం పనులకు వెళ్తే ఫ్యాక్టరీ నుంచి దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ప్యాక్టరీ నుంచి వచ్చే రసాయనాలను ఫ్యాక్టరీ వెనకాల కాలువ తీసి గోపులారం గ్రామ శివారులోని లక్ష్మీనారాయణ చెరువులోకి విడుదల చేస్తున్నారు. ఆ చెరువులో పశువులకు నీరు తాగేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా నీరు కలుషితం కావడం తో నీరు తాగిన పశువులు చనిపోతున్నాయిని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరెస్టు పరిశ్రమ విడుదల చేసే కాలుష్య జలాలు పెద్ద గోప్లారం, ఆరూర్, కోనాపూర్, నాగులపల్లి, ఆత్మకూర్ గ్రామాలలోని కాలువల ద్వారా మంజీరా జలాలలో కాలుష్య నీరు కలవడం వల్ల ప్రజలు, జంతువులు, చేపలకు ప్రమాదకరంగా మారింది.

గతంలో మూసివేతకు నోటీసులిచ్చిన ప్రభుత్వం..

ఎవరెస్టు ఆర్గానిక్స్ పరిశ్రమ కాలుష్యం వల్ల ప్రజలు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయా గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న ప్రభుత్వం విచారణ చేసేందుకు గతంలో కమిటీ నియమించింది. ఈ కమిటీ పరిశీలన చేసి ఫ్యాక్టరీ వల్ల వాయు, జల కాలుష్యం జరుగుతుంది,,ఈటీపీ ప్లాంట్ కూడా పనిచేయడం లేదనే నివేదికను అందించారు. దీంతో కంపెనీని మూసి వేయాలని ఆదేశాలు జారీ కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చే అమ్యామ్యాలకు ఆశపడిన కొందరు పీసీబీ అధికారులు కంపెనీ మూసివేయాలనే ఉత్తర్వులు సీరియస్ గా తీసుకోలేదు. దీంతో ఫ్యాక్టరీ యదేచ్చగా నడుస్తున్నది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాసుల కక్కుర్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే స్థాయికి ఎవరెస్టు పరిశ్రమ వ్యవహరిస్తున్నది. పరిశ్రమ వ్యర్థ జలాలు ఫ్యాక్టరీ కింది భాగం నుంచి చర్ల గోపులారం లక్ష్మీనారాయణ చెరువులోకి వదలడం, ఆ చెరువు కట్ట ధ్వంసం కావడంతో కింద నున్న గ్రామాల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అదే కాకుండా ఈ ప్యాక్టరీ కాలుష్య జలాలు పెద్ద గోప్లారం, ఆరూర్, కోనాపూర్, నాగులపల్లి, ఆత్మకూర్ గ్రామాలలోని కాలువల ద్వారా మంజీరా జలాలలో కాలుష్య నీరు కలవడం వల్ల ప్రజలు, జంతువులు, చేపలకు ప్రమాదకరంగా మారింది. దీనిపై పీసీబీ అధికారులను వివరణ కోరగా ఎవరెస్టు ఫ్యాక్టరీ నుంచి శాంపిల్స్ సేకరించాం..ప్రమాదమని చేరితే చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. గతంలోనే ఫ్యాక్టరీ మూతకు ఆర్డర్ ఉంది కదా అంటే అదేమి లేదంటూ సమాధానం దాటవేశారు. ఇప్పటి కైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తమ స్వార్థం వీడి ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తున్న ఎవరెస్టు ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.



Next Story