చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్ వల్లూరి క్రాంతి

by Aamani |
చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత :  కలెక్టర్ వల్లూరి క్రాంతి
X

దిశ,పటాన్ చెరు : ప్రకృతి సంపద అయిన చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెరువుల ఆక్రమణలను అరికట్టడం తో పాటు అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్ధరించడానికి అధికారులు అంతా కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. మున్సిపల్ శాఖ ద్వారా గృహ నిర్మాణాలకు సంబంధించి మాన్యువల్ అనుమతులు మంజూరు చేయవద్దని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిపాలనలో అధికారులంతా పారదర్శకతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. మున్సిపల్ కార్యాలయ కార్యకలాపాలు సజావుగా కొనసాగడానికి పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా మున్సిపల్ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దానికి తోడు మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ తడి చెత్త పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహించి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపల్ టాక్స్ ను నిర్దిష్ట సమయంలో వసూలు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.

విలీన గ్రామాలైన ముత్తంగి పార్టీ కర్దనూర్ పోచారం ఘనపూర్ గ్రామాల పూర్తి రికార్డులను మున్సిపల్ కార్యాలయంలో అప్పగించాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి కుటుంబం డిజిటల్ కార్డులు పొందడం ద్వారా ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలతో పాటు సర్వీసులను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల ప్రత్యేక అధికారి దేవుజా, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, కమిషనర్ సంగారెడ్డి మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed