దిల్ ఖుష్.. గజ్వేల్‌ను వదలబోనని సీఎం కేసీఆర్ ప్రకటన

by Mahesh |   ( Updated:2023-10-22 04:35:25.0  )
దిల్ ఖుష్.. గజ్వేల్‌ను వదలబోనని సీఎం కేసీఆర్ ప్రకటన
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ‘ఎర్రవల్లిలోనే నా ఇల్లు.. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కామారెడ్డిలో పోటీ చేస్తున్నా.. గజ్వేల్ నియోజకవర్గాన్ని వదలబోనని’ అని సీఎం కేసీఆర్ ప్రకటనతో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు దిల్ ఖుష్ కాగా.. కార్యకర్తల్లో పుల్ జోష్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిందే తరువాయి.. తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల ఎత్తులపై ఎత్తులు.. నేతల వ్యూహ.. ప్రతి వ్యూహాలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రత్యర్థుల వ్యూహాలకు అందని రీతిలో గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్నివదిలి వెళుతారనే ప్రచారం జోరుగా సాగడంతో నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నైరాశ్యానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే శుక్రవారం శామీర్ పేట మండలం అంతాయిగూడలోని ఓ ఫంక్షన్ హాల్ లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తాను గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తుండడం వెనుక కథ వేరే ఉందని, ఎర్రవల్లిలోనే నా ఇల్లు, హైదరాబాద్ పక్క ఉన్న నియోజకవర్గం గజ్వేల్ ను వదిలి ఎందుకు పోతా.. గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే ఉంటుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంతో.. కారు పార్టీ కార్యకర్తల్లో పుల్ జోష్ నెలకొంది. కొంత కాలంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని వదిలి వెళుతారనే ప్రచారానికి తెరదించుతూ, నియోజక వర్గాన్ని వదిలి వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రజలు దిల్ ఖుష్ అయ్యారు.

ఇక్కడ ఎవరు గెలిస్తే..ఆ పార్టీదే అధికారం..

సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్ కు ఓ ప్రత్యేక ఉంది. ఆ నియోజక వర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని నాయకుల విశ్వాసం. ఆ విశ్వాసానికి అనుగుణంగానే 1983లో తెలుగుదేశం పార్టీ అవిర్భావంతో మొదటి సారిగా గజ్వేల్ నుండి అల్లం సాయిలు విజయం సాధించడంతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1985లో జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుండి సంజీవ రావు బరిలో నిలిచి గెలుపొందారు. అప్పుడు సైతం టీడీపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చింది.

1994 లో టీడీపీ అభ్యర్థి డా. విజయ రామారావు, 1999 లో టీడీపీ అభ్యర్థి సంజీవరావు గెలిచిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా డా. గీతారెడ్డి గెలిచిన సందర్భంలో, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి గెలుపొందిన సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చెపట్టింది, 2014, 2018 లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.

సెంటిమెంట్..ఫాలో అవుతున్న కేసీఆర్..

గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ విజయం సాధిస్తే..రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చెప్పటడం ఖాయమన్న సెంటిమెంట్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముచ్చటగా..మూడోసారి సెంటిమెంట్ ఫాలో అవుతూ గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమయ్యారు.గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తీర్పే.. రాష్ట్రంలో అధికార పీఠానికి రాజబాట అన్న సెంటిమెంట్..ఫలిస్తుందో.. లేదో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story