కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలి: సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చంద్రశేఖర్

by Shiva |
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలి: సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చంద్రశేఖర్
X

దిశ, భీమిని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి గద్దె దించాలని సీపీఐ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ అన్నారు. ఆదివారం సీపీఐ పార్టీ ప్రజాపోరు యాత్రలో భాగంగా కన్నెపల్లి మండలంలోని జనకపూర్, దాంపూర్, జజ్జరవెల్లి, రెబ్బెన, కొత్తపల్లి, ముత్తాపూర్, కుర్మగూడ, నాయకంపేట్, గ్రామాల్లో పోరుయాత్ర నిర్వహించారు.

యాత్రలో భాగంగా ఒగ్గుడోలు కళాకారుల బృందం బీరేష్ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. కళాకారుల నృత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు. పాటల ద్వారా ప్రభుత్వాల పని తీరు, మోసాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజలకు వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రభుత్వాలు చేసే కుట్రలపై అవగాహన కల్పించారు. దళిత బంధు భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన వారికి ఇచ్చారని తెలిపారు. పేదరికంలో ఉన్న ఎంతో మంది దళిత బిడ్డలను మరచి ఒకే కుటుంబానికి ఇవ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంపిణీ చేయలేదన్నారు. ధరణి పోర్టల్ పేరుతో పేదలకు తీరని అన్యాయం జరిగిందని, ధరణితో దొరలు, భూ స్వాములకు మాత్రమే భూములు దోచి పెట్టారన్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి రానున్న ఎన్నికల్లో సీపీఐ పార్టీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి, బొంతల లక్ష్మీనారాయణ, మిరియాల రాజేశ్వరరావు, పోషన్న, సన్నీ గౌడ్, మొగిలి, లక్ష్మణ్, రవీందర్, ప్రభాకర్, శీలం చంద్రయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story