కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పగబట్టింది : మంత్రి తన్నీరు హరీష్ రావు

by Shiva |
కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పగబట్టింది : మంత్రి తన్నీరు హరీష్ రావు
X

త్వరలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం

దిశ, మెదక్ ప్రతినిధి : కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పగబట్టిందని.. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. సోమవారం మెదక్ పట్టణంలో పీఆర్టీయూ సంఘ భవన నిర్మాణం కోసం స్థలం మంజూరు పత్రం మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అంతకు ముందు జిల్లా మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉందన్నారు.

ఇది జీర్ణించుకోలేని కేంద్రం రాష్ట్రాన్ని అణచివేతకు గురి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంట్ మీటర్లు పెట్టేందుకు ప్రతి ఏటా రూ.7వేల కోట్లు నిలిపి వేసిందన్నారు. గత నాలుగేళ్లుగా దాదాపు రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వకుండా నిలిపి వేసిందన్నారు. వీటితో పాటు రాష్ట్రానికి రూ.1.33 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల భవిష్యత్తు ముఖ్యం కావడం వల్లే తాము కేంద్రం తీసుకొస్తున్న వాటిని అమలు చేయడం లేదన్నారు. ఈ కారణాల వల్లే రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు కొంత ఆలస్యంగా వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు.

ఉద్యోగ, ఉపాద్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని వారి సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం మహిళలకు పెద్దపీ వేసి మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. నాడు ఊళ్లల్లోకి వెళ్లాలంటేనే గతుకుల రోడ్లు, ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుపడేవారని, కానీ నేడు నీళ్ల యుద్దాలు లేవు, కరెంటు గోసలు లేవన్నారు.

వైద్య రంగాన్ని మెరుగుపరచి డయాగ్నస్టిక్, టిఫా స్కానింగ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల నేడు వందకు 81 శాతం ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా 280 మహిళా సంఘాలకు రూ.23.51 కోట్ల లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్కును మంత్రి మహిళా సమాఖ్యకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాంప్ కార్యాలయం సమీపంలో నిర్మించిన డీసీసీబీ బ్యాంకు భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మేనేజర్ వేణుగోపాలాల్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరేలి కమలాకర్ రావు, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, గుర్రం చిన్న కేశవ రెడ్డి, పీఅర్టీయూ మెదక్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సబ్బని శ్రీనివాస్, సుంకరి కృష్ణ, రాష్ట్ర జిల్లా బాధ్యులు వెంకట్ రాంరెడ్డి, చారి రవికుమార్, సత్య నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, మండల, జిల్లా బాధ్యులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed