నా బలం.. బలగం..‘పటాన్ చెరు’: BRS రాష్ట్ర నాయకుడు నీలం మధు

by Satheesh |   ( Updated:2023-03-29 11:37:58.0  )
నా బలం.. బలగం..‘పటాన్ చెరు’: BRS రాష్ట్ర నాయకుడు నీలం మధు
X

చిట్కుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ఆదర్శ సర్పంచ్ అవార్డు అందుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్.. తన జీవితమే ప్రజలకు అంకితం అంటున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తే ప్రజల సహకారంతో ఆ నియోజక వర్గాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. ‘దిశ’ ప్రతినిధికి చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు..

సర్పంచ్ గా మీ పని తీరు ఎలా ఉంది..?

నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న చిట్కుల్ గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నా. వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దా. చిట్కుల్ ఆదర్శ గ్రామంగా, ఆదర్శ స్పరంచ్ గా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ‘ఎన్ఎంఆర్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నా. ఈ సేవలను పటాన్ చెరు నియోజక వర్గంలోనూ విస్తరించా. ‘తోచినంత సాయం చేయ్.. అందరికీ మంచి చేయ్’ అన్న అమ్మానాన్నల మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ మందుకు సాగుతున్నా. నా సేవలను మరింత విస్తృతం చేస్తా.

పటాన్ చెరు నియోజక వర్గం కోసం మీరేం చేస్తారు..?

జనం కోసం.. జనంతోనే నా జీవన ప్రయాణం. నా బలం.. బలగం.. అంతా ‘పటాన్ చెరు’ నియోజకవర్గ ప్రజలే. ‘మీ సేవలు మాకు కావాలి.. మా కోసం మీరు రావాలి’ అని ఇక్కడి జనం కోరుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నాపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ తరఫున పటాన్ చెరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తే.. ప్రజల మద్దతుతో విజయం సాధిస్తే.. చిట్కుల్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినట్లే పటాన్ చెరు నియోజక వర్గానికీ పేరు తెస్తా.

పటాన్ చెరులో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేంటి..?

ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్ చెరు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు రూ.10-15 వేలకు ఇక్కడి పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వాళ్ల కష్టమంతా ఇంటి కిరాయిలు, పిల్లల చదువులు, వైద్యానికే సరిపోతోంది. పేదలు, మధ్య తరగతి ప్రజల పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చి దిద్దుతా.

ప్రతి నెల టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల హాజరు శాతం, విద్యా ప్రమాణాలు, మార్కులు ఎక్కువగా వచ్చేట్లు కృషి చేస్తా. సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన సౌకర్యాలకు కృషి చేస్తా. అత్యవసర సర్వీసులతో పాటు లేబరేటరీ సౌకర్యాన్ని కల్పిస్తా. మనకు దానగుణం ఉన్న సీఎం ఉన్నారు. పెద్దాయన కాళ్లు మొక్కి గూడులేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తా. సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు మంజూరు చేయిస్తా.

పచ్చదనం, పరిశ్రుభ్రత కోసం ఏం చేస్తారు..?

పటాన్ చెరు, ఇస్నాపూర్, అమీన్ పూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అపార్ట్ మెంట్లు, కాలనీలు వెలుస్తున్నాయి. అయితే.. అక్కడి ప్రజలకు సరిపడ గ్రీనరీ, పార్క్ లు అందుబాటులో లేవు. కాలనీల్లో మౌళిక సదుపాయలు కల్పించడంతో పాటు పిల్లలకు ఆట స్థలాలు, పార్క్ లు, పచ్చదనం పెంపొందించడానికి కృషి చేస్తా.

పారిశ్రామిక ప్రాంతం కావడంతో పచ్చదనం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో డంప్ యార్డులు ఏర్పాటు చేసి.. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తడి, పొడి చెత్తలను వేరు చేయించి.. వాటిని ఇతర అవసరాలకు వాడుకునేలా చర్యలు చేపడతాం. అన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్తు లోవోల్టేజీ సమస్యలుంటే పరిష్కారిస్తా. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సహకారంతో మూడు మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.

‘గుడ్ మార్నింగ్ పటాన్ చెరు’ ఏంటి..?

ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా గ్రామాల్లోకి వెళ్తేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి. ‘గుడ్ మార్నింగ్ పటాన్ చెరు’ పేరుతో ఉదయం రోజూ ఒక గ్రామంలో పర్యటిస్తా. ప్రజల సమస్యలు తెలుసుకొని సాధ్యమైనవి అక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. పెద్ద సమస్యలుంటే అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఉన్నంత సంతృప్తి మరెక్కడా లభించదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తా. మంత్రుల సహకారంతో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తా. అప్రోచ్ రోడ్లు వేయిస్తా. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా.

మీ గురించి..?

దేవుడిచ్చిన కాడికి నాకున్నది. పట్టణ ప్రాంతం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు కొంత ఆదాయం వస్తుంటుంది. వచ్చినదాంట్లో ఆలయాల మరమ్మత్తులు, కొత్త ఆలయాల నిర్మాణం, పేద పిల్లల చదువు.. ఇలా అవసరమైన వారికి నావంతు సాయం చేస్తుంటా. కరోనా మహమ్మారి మా కుటుంబంలో నింపిన విషాదాన్ని ఎన్నడూ మర్చిపోలేను. ఒక్క రోజు తేడాతో నా తల్లిదండ్రులను బలి తీసుకున్నది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటా. తెలియని విషయాలు తెలుసుకుంటా. ప్రజా సేవకే నా జీవితాన్ని అంకితం చేస్తా.

Advertisement

Next Story

Most Viewed