- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BIG News: రూ.300 కోట్ల టీజీఐఐసీ భూములకు ఎసరు.. రాత్రికి రాత్రే బోర్డు మార్పు

దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్‌చెరు: పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం సేకరించి పరిశ్రమలకు అప్పగించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయవనరుగా మారాయి. పరిశ్రమల ఏర్పాటు పేరుతో అప్పనంగా కైవసం చేసుకున్న స్థలాలలో రియల్ వ్యాపారం మొదలు పెట్టడానికి కొందరు సిద్ధమయ్యారు. 30 ఏళ్లుగా ఖాళీగా ఉన్న స్థలంలో ప్రవేశించి టీజీఐఐసీ బోర్డులను తొలగించి రాత్రికి రాత్రి తమ పేర్లతో బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులను తిరిగేయడమే కాకుండా ఏకంగా భూమి చుట్టూ ప్రహరి నిర్మాణాన్ని చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు రెవెన్యూ పరిధిలో పారిశ్రామిక అవసరాల కోసం 1993 లో సుమారు 110 ఎకరాల భూమిని లైట్ క్రేట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కి పరిశ్రమ అవసరాల నిమిత్తం కేటాయించారు.
అయితే, పరిశ్రమ ఏర్పాటు చేయడంతో పాటు భూమికి సంబంధించిన కనీస మొత్తాన్ని చెల్లించకపోవడంతో టీజీఐఐసీ (అప్పట్లో ఏపీఐఐసీ) భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో సదరు భూమిని అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా భూ కుంభకోణంలో సంచలనమైన ఒక వ్యక్తికి అంధికారికంగా అగ్రిమెంట్ సేల్ చేయగా ఆయన అడ్డగోలుగా ఈ భూముల్ని అనధికారికంగా విక్రయాలకు పాల్పడ్డాడు. అంతే కాకుండా 2006 లో అప్పటి ప్రభుత్వ పెద్దల అండ దండలతో అధికారులను మభ్య పెట్టీ ఎన్వోసీ తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా శ్రీ నిధి ఇండస్ట్రీస్ కు సర్వే నంబర్లు 833,834,836, 837,838 లలో 15.04 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారు. ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపించాల్సి ఉండగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా సదరు స్థలాన్ని ముప్పై ఏండ్లుగా ఖాళీగా వదిలేశారు.
30 ఏళ్లుగా లేని పరిశ్రమ ఇప్పుడు పెడతారట..
1993 లో సరిగ్గా 32 ఏండ్ల కింద పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన భూములలో పరిశ్రమ ఏర్పాటు చేయకుండా ఖాళీగా ఉంచారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్ని ఖాళీగా ఉంచడంతో టీజీఐఐసీ ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ భూములు తమకు చెందుతాయని ఏండ్లుగా హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. అయితే భూములు జాతీయ రహదారిని అనుకొని ఉండటం, భూముల విలువ భారీగా పెరగడంతో మళ్ళీ ఆ భూముల పై కన్నేసిన పాత వ్యక్తులు తిరిగి భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.అనుకున్నదే తడవుగా భూమిని చదును చేసి చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో సదరు నిర్మాణధారులు పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ప్రహరీ నిర్మిస్తున్నామని చెపుతున్నారు. 30 ఏండ్ల నుంచి ముందు యజమానికి, 19 ఏండ్లుగా భూ బదలాయింపు చేసుకున్న కంపెనీకి గుర్తు రాని పరిశ్రమ ఏర్పాటు హఠాత్తుగా గుర్తుకురావడం విడ్డూరమనే చెప్పుకోవచ్చు. భూముల ధరలు అమాంతం పెరగడం, ఆ భూమి జాతీయ రహదారిని అనుకొని ఉండటంతో భూమి స్వాధీనం చేసుకోవడానికి కొత్త ప్రయత్నాలకు తెరలేపినట్లు విమర్శలు వస్తున్నాయి.
కూల్చినా.. మళ్లీ మొదలైన పనులు
ముంబై జాతీయ రహదారి పక్కన పరిశ్రమ భూముల్లో కొనసాగుతున్న ప్రహరీ నిర్మాణంతో పాటు భూమిని చదును చేస్తున్న విషయం పై టీజీఐఐసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించిన అధికారులు చుట్టు నిర్మించిన ప్రహరీ గోడలు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ప్లాట్లను విక్రయిస్తున్నారన్న ప్రచారం జరగడంతో అక్కడ ఎలాంటి పనులు చేపట్టకూడదని టీజీఐఐసీ అధికారులు సదరు యాజమాన్యాన్ని ఆదేశించారు. అయితే, 2006 లో అప్పటి అధికార పార్టీ ముఖ్యనేత అండదండలతో అధికారులను ఒత్తిడి చేసి పొందిన ఎన్ఓసి తో అడ్డగోలుగా చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సహకారంతో కోర్టును ఆశ్రయించి ప్రహరీ నిర్మాణ విషయంలో అధికారులు కలుగచేసుకోకుండా ఆర్డర్ తెచ్చుకుని మళ్ళీ యధావిధిగా ప్రహరీ నిర్మాణంతో పాటు లోపల చదును చేస్తున్నారని తెలుస్తుంది.
అక్రమ నిర్మాణాలను ఆపండి: నిర్మల జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసి టీజీఐఐసీ స్వాధీనం చేసుకున్న భూముల్లో మళ్ళీ తిరిగి వచ్చి నిర్మాణాలు చేయడం సరికాదని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. ముప్పై ఏండ్లుగా సాధ్యం కాని పరిశ్రమ ఏర్పాటు ఇప్పుడు చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. 2006 లో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో అడ్డగోలుగా నిబంధన ఉల్లంఘనలకు పాల్పడి భూ కేటాయింపు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి ఖాళీ గా ఉన్న స్థలంలో ఉన్నట్టుండి తమ భూమన్నట్లుగా ప్రైవేట్ వ్యక్తులు చదను చేయటానికి ఆమె తప్పు పట్టారు. ఈ భూములు టీజీఐఐసీ కి చెందుతాయని ఈ భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం తగదని హెచ్చరించారు. ఇప్పటికే వ్యవహారంలో జోక్యం చేసుకుని పనులు ఆపాలని టీజీఐఐసీ ఎండీ కి లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని ఆమె స్పష్టం చేశారు. 1993లో పటాన్ చెరు ప్రాంతంలో జరిగిన భూ కేటాయింపులలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమ కేటాయింపులు రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు: రతన్ రాథోడ్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్
సర్వే నంబర్లు 833, 834,836, 837 ,838 భూములలో చేపట్టిన ప్రహరీ నిర్మాణాన్ని గతంలోనే కూల్చి వేశాం. అయితే సదరు నిర్మాణధారులు హై కోర్టును ఆశ్రయించి ప్రహరీ నిర్మాణంలో కలుగచేసుకోకూడదని ఆర్డర్ తీసుకునివచ్చారు. దాంతో మళ్ళీ సదరు సంస్థకు సంబంధించిన వ్యక్తులు నిర్మాణ పనులను మొదలుపెట్టారు.ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. దీని పై త్వరలో కౌంటర్ ఫైల్ చేస్తాం.పరిశ్రమల నిర్మాణం కోసం కేటాయించిన భూముల్లో ఇప్పటివరకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదనే విషయం మా దృష్టికి వచ్చింది. భూముల్లో పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో ఏండ్లుగా మా సంస్థ అధీనంలోనే ఉన్నాయి. 2016 లో జరిగిన సబ్ డివిజన్ మార్పు తో పాటు జారీ చేసిన ఎన్ఓసి విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోర్టు ఉత్తర్వులను అనుసరిస్తూ తదుపరి చర్యలు తీసుకుంటాం.