రోగులకు మెరుగైన సేవలు అందించాలి

by Sridhar Babu |
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కంది మండల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ రోగులకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అక్కడే ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా చూడాలని, ప్రభుత్వాసుపత్రిలోనే అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నందున ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాలలో ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధులైన డెంగు, మలేరియా, డయేరియా లాంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

ధరణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ధరణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ఎంక్వయిరీ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని తహపీల్దార్ ను ఆదేశించారు. గ్రామాలలో చెరువులు కుంటలు శిఖం భూములలో ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని వాటిపై నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అక్కడ నుంచి నేరుగా జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక కస్తూర్బా పాఠశాలను సందర్శించి అక్కడే వారితో కలిసి ఆమె మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీఓ మహేందర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed