Simultaneous Polls : వస్తోంది.. ‘జమిలి’ !! టాప్ పాయింట్స్ ఇవిగో..

by Hajipasha |
Simultaneous Polls : వస్తోంది.. ‘జమిలి’ !! టాప్ పాయింట్స్ ఇవిగో..
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కారు బుధవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో జమిలి ఎన్నికలకు సంబంధించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని పొందడంతో పాటు 18 రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. అయితే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో చెరో 67 శాతం మంది సభ్యులు అనుకూలంగా ఓటువేయాలి. దేశంలోని లోక్‌భ స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికల లక్ష్యం. ఈ ప్రక్రియను నిర్వహించిన 100 రోజుల తర్వాతే స్థానిక ఎన్నికలను నిర్వహించవచ్చు. అయితే ఇందుకోసం దేశంలోని కనీసం సగం రాష్ట్రాల ఆమోదాన్ని పొందడం తప్పనిసరి.

ప్రాంతీయ పార్టీలు కీలకం..

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి లోక్‌సభలో ప్రస్తుతం 61 శాతం సీట్లు ఉన్నాయి. రాజ్యసభలో ఇప్పటికీ ఎన్డీయే కూటమికి 38 శాతం సీట్లే ఉన్నాయి. ఈనేపథ్యంలో జమిలి ఎన్నికలపై విపక్ష పాలిత రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి ? ప్రధాన విపక్ష పార్టీలు ఎలాంటి వైఖరిని వ్యక్తపరుస్తాయి ? అనేది కీలకంగా మారనుంది.చాలావరకు ప్రాంతీయ పార్టీలు జమిలిని వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు విషయంలో జాతీయ పార్టీలతో తాము పోటీపడలేమని అవి వాదిస్తున్నాయి. ఒకేసారి లోక్‌సభకు, శాసనసభకు ఎన్నికలు జరిగితే ప్రజలు ఏదో ఒక పార్టీకి పట్టం కడతారని.. ఆ పరిణామం తమ విజయావకాశాలను తగ్గిస్తుందని పలు రీజియనల్ పార్టీలు భావిస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాలకు ప్లస్.. కొన్నింటికి మైనస్

2029 ఎన్నికల నాటికి జమిలి ఎన్నికల ప్రక్రియను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అయితే సరిగ్గా ఆ సమయానికే అన్ని రాష్ట్రాల పాలనా కాలం ముగియడం లేదు. కొన్ని రాష్ట్రాలకు 2029 నాటికి ఇంకొన్నేళ్ల పాలనా కాలం మిగులుతోంది. సూటిగా చెప్పాలంటే.. ఒకవేళ 2029 నుంచే జమిలి ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెస్తే కొన్ని రాష్ట్రాలు పాలనా కాలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేసేలా, న్యాయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఒక రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఆమోదించనుంది. సరిగ్గా 2029 నాటికి పాలనా కాలం ముగుస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లడఖ్, లక్షద్వీప్ ఉన్నాయి. 2028 నాటికి పాలనా కాలాన్ని పూర్తి చేసుకోనున్న రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర ఉన్నాయి. 2029లో జమిలి ఎన్నికలు జరిగితే.. 2026, 2027 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాలు/యూటీలలో ఏర్పడే ప్రభుత్వాలకు కనీసం రెండు, మూడేళ్ల పాలనా కాలం లభిస్తుంది. కానీ 2028 నాటికి పాలనా కాలాన్ని పూర్తి చేసుకునే రాష్ట్రాలు/యూటీలలో ఏర్పడే కొత్త సర్కారులకు పాలన కోసం ఏడాది టైం మాత్రమే మిగులుతుంది.

లాభం.. నష్టం.. ?

జమిలి ఎన్నికల విధానం వల్ల ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఏకకాలంలో నిర్వహిస్తే ఆ ఖర్చులన్నీ తగ్గిపోతాయి. పదేపదే ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కానీ.. బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన అవసరం కానీ ఉండదు. దీని ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిపోతుంది. ఉదాహరణకు 2009 లోక్‌సభ ఎన్నికలకు రూ.1115 కోట్లు, 2014లో రూ.3870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు పది వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి రూ. 250 కోట్లు ఖర్చవుతుందని భావిస్తే.. మొత్తం 28 రాష్ట్రాలకు ఎంత అవుతుందో మనకు అర్థమైపోతుంది. అయితే ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అంత ఈజీ కాదనే వాదన కూడా ఉంది. భారీ సంఖ్యలో నిధులు, మానవ వనరులను ఏకకాలంలో సర్దుబాటు చేయడం పెద్దసవాల్‌గా మారుతుందని కొందరు వాదిస్తున్నారు. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలకు పౌరులందరికీ ఒకే ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. స్థానిక ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సంప్రదింపులు జరిపి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వీటిని తయారు చేయాలి. ఇందుకోసం 325వ అధికరణను సవరించాలి.

జమిలి.. మన దేశానికి కొత్తేమీ కాదు..

జమిలి ఎన్నికల ప్రక్రియ మన దేశానికి కొత్తేమీ కాదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, 1951-1952లో లోక్‌స భ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించారు. ఈ విధానం 1967 వరకు కొనసాగింది. అయితే ఆర్టికల్‌ 356తో కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఈ విధానానికి అంతరాయం కలిగింది. కొన్ని కారణాల వల్ల మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగింది. దీంతో కాలక్రమేణా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. 1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన చేసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. 2016లో ప్రధాని మోడీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతి ఆయోగ్ దీనిపై ఒక నివేదిక సమర్పించింది. 2018 ఆగస్టులో లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏకకాల ఎన్నికలపై ఒక ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఇది అనేక రాజ్యాంగపరమైన, చట్టపరమైన సవాళ్లను ముందుంచింది. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగంలోని 1951 ప్రజాప్రతినిధుల చట్టంతో పాటు లోక్‌సభ, అసెంబ్లీల విధివిధానాల్లో సవరణలు అవసరమని కమిషన్‌ సూచించింది. కనీసం 50 శాతం రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలని సిఫారసు చేసింది. 2019లో మోడీ నేతృత్వంలో బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు జమిలి ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ప్రతిపక్షాలు బహిష్కరించాయి. దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం 2022లో తెలిపింది. 2022 డిసెంబర్‌లో లా కమిషన్ అన్ని పార్టీలను సంప్రదించి, అభిప్రాయాన్ని కోరింది.

ఏడు దేశాలపై కోవింద్ కమిటీ అధ్యయనం

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని కమిటీ దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్‌, బెల్జియం, ఇండొనేసియా, జపాన్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల ఎన్నికల విధానాలపై అధ్యయనం చేసింది. దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీ, ప్రొవిన్షియల్‌ (ప్రాంతీయ) అసెంబ్లీలకు పౌరులు ఏకకాలంలో ఓట్లు వేస్తారు. అయితే ఈ దేశంలో మున్సిపల్‌ ఎన్నికలు మాత్రం విడిగా జరుగుతాయి. స్వీడన్‌లో దామాషా ఎలక్టోరల్ వ్యవస్థ అమల్లో ఉంది. పార్లమెంటు (రిక్స్‌దాగ్‌), కౌంటీ కౌన్సిళ్లు, మున్సిపల్‌ కౌన్సిళ్లకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. వివిధ రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా వాటికి పార్లమెంటు, మండళ్లలో సీట్లు కేటాయిస్తారు. ఈ ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబరు రెండో ఆదివారంలో జరుగుతాయి. మున్సిపల్‌ కౌన్సిళ్లకు ప్రతి ఐదేళ్లకోసారి సెప్టెంబరు రెండో ఆదివారం రోజే ఎన్నికలు జరుగుతాయి.

Advertisement

Next Story