సంజీవనరావుపేటలో దారుణం.. ఇంటికి కరెంటు షాక్ పెట్టిన దుండగులు

by Shiva |
సంజీవనరావుపేటలో దారుణం.. ఇంటికి కరెంటు షాక్ పెట్టిన దుండగులు
X

బాధితులను కాపాడిన స్థానికులు..

దిశ, నారాయణ ఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తో కుటుంబాన్ని చంపేందుకు దుండగులు యత్నించిన ఘటన నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేటలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవనరావుపేట గ్రామానికి చెందిన ధనియాల రాములు వృతి రీత్య రైతు. రోజూ మాదిరి గానే ఇంట్లో రాములు, తన భార్య రామవ్వ, కూతురు, మనుమరాలుతో నిద్రించాడు.

రాములు తన మూడెకరాల భూమిలో వరి పొలానికి నీరు పారపెట్టడానికి రోజు వెళ్లేవాడు. కానీ శనివారం తెల్లవారుజామున కూడా రాములు పొలానికి వెళ్లాడని అనుకున్నారు దుండగులు. ఇదే అదునుగా భావించిన వారు కరెంటు షాక్ రాములు హతమార్చేందుకు స్కెచ్ వేశారు. రాత్రి ఇంటి ముందున్న మీటర్ నుంచి ఇంటి తలుపుకు కరెంట్ సప్లై ఇచ్చారు. అదేవిధంగా బకెట్లో నీళ్లు పోసి అందులో ఇనుప రాడ్ పెట్టి ఎర్తింగ్ ఇచ్చారు. అయితే ఉదయాన్నే రాములు పొలానికి వెళ్లకపోవడంతో భార్య రామవ్వ తలుపు తీయగా ఆమెకు కరెంట్ షాక్ కొట్టింది.

దీంతో ఇంట్లో వాళ్లు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వచ్చి వారిని రక్షించారు. అదేవిధంగా దుండగులు రాములు బావి వద్ద ఉన్న రెండు మోటర్లను కూడా తగలబెట్టారు. బాధితుడు రాములు తనను చంపేందుకు ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై నారాయణ ఖేడ్ ఎస్సై వెంకట్ రెడ్డిని వివరణ కోరగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story