అందోలు బీజేపీలో లుకలుకలు

by Naresh |   ( Updated:2024-03-02 17:04:45.0  )
అందోలు బీజేపీలో లుకలుకలు
X

దిశ, అందోల్‌: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందోలు నియోజకవర్గ బీజేపీలో వర్గ పోరు మొదలైంది. ఎవరికి వారు అధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయని నాయకులంతా బాబూమోహన్‌ రాజీనామాతో ప్రత్యక్షమయ్యారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నేనే నాయకుడినంటూ షో చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు సీనియర్‌ నాయకులు పార్టీకి అంటినట్లుగా వ్యవహరించిన వారందరూ ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ తెర పైన ప్రత్యక్షమై హడావిడి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బాబూమోహన్‌కు వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ పార్టీకి కేవలం 5 వేల లోపు ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే.

మూడు గ్రూపులు...ఎవరికి వారు అధిపత్యం:

అందోలు బీజేపీ పార్టీలో మూడు గ్రూపులుగా చీలి ఎవరికి వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బాబూమోహన్‌ సహయనిరాకరణ చేసిన సీనియర్‌ నాయకులంతా మళ్లీ తెరపైకి వచ్చారు. ఆదే సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న మాజీ జడ్పీ చైర్మన్‌ బాలయ్యను పార్టీలోకి కొందరు నాయకులు తీసుకొచ్చారు. బాలయ్యకు అందోలు అసెంబ్లీ టిక్కెట్‌ను ఇప్పించేందుకు ప్రయత్నాలు జరగడంతో అప్పట్లో బాలయ్య వర్సెస్‌ బాబూమోహన్‌గా మారింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో అనంతరావు కులకర్ణి, ప్రభాకర్‌ గౌడ్, బాబూమోహన్‌ వర్గీయులుగా ముద్రపడిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. జహీరాబాద్‌ ఎంపీ టిక్కెట్‌ను ఆశిస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎవరికి వారు అండగా నిలుస్తున్నారు. సదరు అభ్యర్థి పర్యటనకు వచ్చిన సందర్భంలో మద్దతునిచ్చే గ్రూపు నాయకులే ఆయన వెంట ఉంటున్నారు. దీంతో కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది. ఎవరి వెంట వేళ్లాలో...ఎవరికి మద్దతిస్తే ఏం జరుగుతుందోనని ఆందోళన మాత్రం కార్యకర్తల్లో బలంగా ఉంది.

నియోజకవర్గ స్థాయి నాయకుడు కరువు:

అందోలు నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గ స్థాయి నాయకుడు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఒక్కరికి కూడా నియోజకవర్గ స్థాయిలో ఓటర్లను ఆకర్షించే చరిష్మా లేదనే చెప్పవచ్చు. 2018లో టీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్‌ రాకపోవడంతో బాబూమోహన్‌ బీజేపీలో చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అందోలు బీజేపీ ఇంచార్జీగా కొనసాగారు. 2023 ఎన్నికల్లో మాజీ జడ్పీ చైర్మన్‌ బాలయ్య, బాబూమోహన తనయుడు ఉదయ్‌ బాబూమోహన్‌లు ఆశించినా, అధిష్టానం బాబూమోహన్‌ టిక్కెట్‌ను కేటాయించింది. దీంతో బాలయ్య, ఉదయ్‌ బాబూమోహన్‌లు వారి వర్గీయులతో కలిసి హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. బాబూమోహన్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్‌ నాయకులేవరూ పార్టీ కోసం పనిచేయకుండా దూరంగా ఉండడంతో కేవలం 5 వేల ఓట్లకే పరిమితమై డిపాజిట్‌ను కొల్పోయారు. ఎన్నికల తర్వాత బాబూమోహన్‌ పార్టీలో ఎవ్వరూ పట్టించుకొకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నియోజకవర్గ బీజేపీ పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

సభతో బయటపడ్డ విబేధాలు:

గత నెల 27, 28వ తేదీల్లో జోగిపేటలో బీజేపీ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర సందర్బంగా నిర్వహించిన సభ నిర్వాహణను సీనియర్‌ నాయకుడు అనంతరావు కులకర్ణికి అప్పగించగా, జీర్ణించుకోలేని మిగతా పార్టీ నాయకులు సభకు జనాలను ఎక్కువ సంఖ్యలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా సభకు వెయ్యి మందిని జన సమీకరణ చేయాలని భావించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన జనాలను తీసుకువచ్చినా వారికి డబ్బులు ఇవ్వలేదని పార్టీ నాయకులే బహిరంగంగా ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. జోగిపేటలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటన ఉందని వారం రోజులుగా ప్రచారం నిర్వహించిన అనుకున్నంతగా బీజేపీ ప్రభావం కనిపించకపోవడంతో వారిద్దరి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమతో సభను నిర్వహించుకున్నారు. తాము తీసుకువచ్చిన జనాలకు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని సుజీత్‌ అనే కార్యకర్త బహిరంగంగానే ఆరోపణలు చేశారు. నియోజకవర్గం నాయకత్వ లోపంతో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది.

Advertisement

Next Story