పటాన్ చెరులో మున్సిపల్ పాలనలోకి 11 పంచాయతీలు..

by Aamani |
పటాన్ చెరులో మున్సిపల్ పాలనలోకి 11 పంచాయతీలు..
X

దిశ,పటాన్చెరు : ఔటర్ రింగ్ రోడ్డు ని అనుకుని ఉన్న శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలైన అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తాండ, పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట, సుల్తాన్ పూర్, దాయర గ్రామ పంచాయతీల రికార్డులను అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, పటాన్ మండల పరిధిలోని పాటి, కర్థనూరు, ఘనాపూర్, ముత్తంగి, పోచారం గ్రామాల రికార్డులను తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి నేతృత్వంలో మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారికంగా 11 గ్రామాలలో మున్సిపల్ పాలన ప్రారంభమైంది. 11 గ్రామ పంచాయతీలను డి నోటిఫై చేస్తూ పంచాయతీ శాఖ నిర్ణయం తీసుకోవడంతో గ్రామపంచాయతీ బోర్డులను సైతం మున్సిపాలిటీలుగా మార్చారు.

రికార్డుల స్వాధీనంలో గందరగోళం..

గ్రామపంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తమ ఉన్నతాధికారుల నుంచి తమకు రికార్డులు అప్పగించాలని ఎటువంటి ఆదేశాలు రాలేదని పంచాయతీ కార్యదర్శులు తేల్చి చెప్పడంతో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం తో వారు డిపిఓ తో మాట్లాడి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు పంపేలా చేశారని తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి సమాచారం లేకపోవడంతో ఉన్నతాధికారుల సమన్వయ లోపం, అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక నుంచి మున్సిపల్ పాలన

అమీన్ పూర్ మండలంలోని ఆరు గ్రామాలు అమీన్ పూర్ మున్సిపాలిటీ , పటాన్ చెరు మండలంలోని విలీనమైన ఐదు గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీల పాలనలో ఉంటాయని అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్లు జ్యోతి రెడ్డి, సంగారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో తాత్కాలికంగా మున్సిపల్ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.

ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను మున్సిపల్ లో కొనసాగించడానికి అవకాశం ఉందని, నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు మున్సిపల్ పరిధిలోకి వస్తారని, ఇష్టం లేని ఉద్యోగులు తిరిగి పంచాయతీ శాఖ లోకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శుల ఇష్ట ప్రకారం వారికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేశారు.విలీన గ్రామాలలో పర్యటించి సమస్యలు కనుక్కొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్లు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed